కన్నా మౌన దీక్ష: రాజధానిగా అమరావతి కొనసాగించాలి: ప్రధాని శంకుస్థాపన ప్రదేశంలో..!
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయన మౌన దీక్షకు దిగారు. అమరావతి నుండి రాజధాని తరలింపును నిరసిస్తూ ఆయన పార్టీ శ్రేణులతో కలిసి మౌన దీక్షకు దిగారు. రాజధాని పరిధిలోని ఉద్దండరాయుని పాలెంలో 2015లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో మౌన దీక్షకు దిగారు. ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని ఎలా తరలిస్తారని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయ కక్ష్య పూరితంగా తీసుకుంటున్న నిర్ణయాలుగా ఆయన ఆరోపించారు.
రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని కన్నా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కన్నాతొ పాటుగా బీజేపీ నేతలు టొబాకో బోర్డు ఛైర్మన్ యడ్లపాటి రఘునాధబాబు..విష్ణు వర్దన్ రెడ్డి రైతుల దీక్షలకు సంఘీభావం ప్రకటించారు. వారి నిరసనల్లో పాల్గొన్నారు. ఒక వైపు.. సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలోనే రాజధాని మార్పుతో పాటుగా.. అమరావతి రైతులకు ఎలాంటి హామీ ఇస్తారనేది నేటి భేటీలో నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.
జీఎన్ రావు కమిటీ చేసిన సిఫార్సులతో పాటుగా.. అమరావతి ప్రాంతం పైన కేబినెట్ లో కీలక చర్చ జరగనుంది. వారికి తిరిగి డెవలప్ చేసిన ప్లాట్లు ఇవ్వాలనే అంశం పైన కీలక నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో పాటుగా రైతులతో సంప్రదింపుల కోసం మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు పైన ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామంటూ ప్రభుత్వం చెబుతూ వస్తోంది.

కేబినెట్ జరగనుండటంతో..ఆ ప్రాంతంలో ఆందోళనలకు అవకాశం లేకుండా పోలీసులు పెద్ద ఎత్తున మొహరించారు. విజయవాడ నుండి రాజధాని ప్రాంతంలోకి రాకపోకల పైన ఆంక్షలు విధించారు. రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్ అమలవుతోంది. మండదం వద్ద ధర్నకు అనుమతి నిరాకరించారు. రాజధాని గ్రామాల్లో పోలీసుల మొహరింపు పైన గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదే సమయంలో నిఘా చీఫ్ మనీష్ కుమార్ సిన్హా ముఖ్యమంత్రి జగన్ తో సమావేవమయ్యారు. ప్రకాశం బ్యారేజి నుండి అమరావతికి వచ్చే దారిని తాత్కాలికంగా మూసివేసారు. ప్రతీ గ్రామ శివార్లలో ముళ్ల కంచెల తో పోలీసు పహారా ఏర్పాటు చేసారు. ఇక..కన్నా లక్ష్మీనారాయణ దీక్షకు మద్దతుగా బీజేపీ నేతలతో పాటుగా రాజధాని ప్రాంత గ్రామాల ప్రజలు తరలి వచ్చారు. గంట పాటు ఆయన దీక్ష కొనసాగనుంది. పోలీసులు సచివాలయం పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొహరించి..ప్రతీ కదలికను పరిశీలిస్తున్నారు.












Click it and Unblock the Notifications