బాబుపై బిజెపి సంతోషం!, మేమిక్కడ.. నీవెక్కడ: జగన్‌పై లోకేష్ ఘాటుగా
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ఖర్చును కేంద్రం తిరిగి చెల్లిస్తుందని దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు బుధవారం నాడు అన్నారు. పోలవరం పనుల పైన భారతీయ జనతా పార్టీ సంతృప్తితో ఉందని చెప్పారు.పోలవరం పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని తాము ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామన్నారు.
ఏపీలో 20వేల ఎకరాల దేవాలయ భూములు కబ్జా అయ్యాయని దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు వేరుగా చెప్పారు. కబ్జాదారుల వివరాలను దేవాలయాల వద్ద బోర్డులో ఉంచుతామని చెప్పారు. అక్టోబర్ చివరికల్లా ఈ-ప్రగతి వెబ్‌సైట్‌లో ఆలయ సేవలు, ఆస్తులు, ఆభరణాల వివరాలు పొందుపరుస్తామన్నారు.
విజయవాడ కార్యాలయానికి లోకేష్
తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ బుధవారం నాడు విజయవాడ పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర ఆయనకు ఘన స్వాగతం పలికారు. కృష్ణా జిల్లా టిడిపి కార్యాలయాన్ని ఏపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంగా ప్రకటించారు. లోకేష్ రాక సందర్భంగా పార్టీ కార్యాలయానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చారు.

చంద్రబాబు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతా: కళా వెంకట్రావు
చంద్రబాబు తన పైన ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఏపీ టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ను కళా వెంకట్రావు విజయవాడ పార్టీ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పార్టీకి, ప్రభుత్వానికి సమన్వయం చేస్తామన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.
జగన్‌పై లోకేష్ నిప్పులు
మంగళవారం రాత్రి నారా లోకేశ్ వైసిపి అధ్యక్షులు జగన్‌పై ఘాటు విమర్శలు గుప్పించారు. చంద్రబాబు హైదరాబాదులో లేక మూడు నెలలు అవుతోందని, ఆయన ఆంధ్రాలోనే ఉంటున్నారని, మరి ప్రతిపక్ష నేత ఎక్కడ అని ప్రశ్నించారు. ఆంధ్రా ప్రతిపక్ష నేతగా హైదరాబాదులో 70 గదుల ఇంటిలో గడుపుతున్నారన్నారు.
ఆయన చెప్పిన అన్ని మాటలను వినాల్సిన అవసరం తమకు లేదన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్లలో మంగళవారం జరిగిన పార్టీ కార్యకర్తల శిక్షణా శిబిరంలో మాట్లాడారు. దొంగబ్బాయి మాయలో ఎవరూ పడొద్దని, ప్రతిదానికీ ఆయన అడ్డంకే అన్నారు. రాజధానికి భూసేకరణ వద్దంటారని, బందరు పోర్టును కాదంటారని, ఇదీ ఆయన తత్వమని, ఇదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు.












Click it and Unblock the Notifications