ఆంధ్రప్రదేశ్‌లో స్పీడ్ పెంచుతున్న బీజేపీ
భారతీయ జనతాపార్టీ తన వ్యూహం మార్చుకుంది. తెలంగాణతోపాటు ఏపీలో కూడా స్పీడ్ పెంచాలని నిర్ణయించుకుంది. 5వేల ప్రదేశాల్లో బహిరంగ సభలు, సమావేశాలు జరపబోతోంది. రాష్ట్రంలోని సమస్యలను గుర్తించి వాటిపై ప్రజలను చైతన్యపరిచేందుకు ఉద్యమ కార్యాచరణ కమిటీని 8 మంది సభ్యులతో ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి కన్వీనర్ గా సీనియర్ ఐఏఎస్‌గా పదవీ విరమణ చేసిన ఐవైఆర్ కృష్ణారావును నియమితులయ్యారు.

10, 11 తేదీల్లో కేంద్ర మంత్రుల పర్యటన
తాజాగా ఇద్దరు కేంద్ర మంత్రులు ఏపీ పర్యటనకు వస్తున్నారు. ఈ నెల 10, 11 తేదీల్లో సామాజిక న్యాయశాఖ మంత్రి నారాయణస్వామి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి భారతీ పవార్ వస్తున్నారు. నారాయణస్వామి విజయవాడ లోక్‌సభ పరిధిలో, భారతీ పవార్ బందరు లోక్‌సభ పరిధిలో పర్యటించబోతున్నారు.
కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు ఎలా అమలవుతున్నాయనేదాన్ని వీరు పరిశీలిస్తారు. సాధారణ కార్యకర్తల ఇళ్లల్లో వీరికి భోజన వసతి ఏర్పాటు చేశారు.

తెలంగాణలో టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డ కేంద్ర మంత్రులు
సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు వీరు పర్యటించబోతున్నట్లు సమాచారం. ఇంతకుముందే తెలంగాణలో కేంద్ర మంత్రులు ఇద్దరు పర్యటించి అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, భారీ పరిశ్రమలశాఖ మంత్రి మహేంద్రనాథ్‌పాండే విమర్శలకు రాష్ట్ర మంత్రులు కూడా వారికి అదేస్థాయిలో సమాధానం చెప్పారు. రేషన్ దుకాణాల్లో ప్రధానమంత్రి ఫొటో పెట్టలేదంటూ నిర్మల అంటే గుజరాత్‌లో ముఖ్యమంత్రిగా మోడీ ఉన్నప్పుడు పెట్టారా? అంటూ హరీష్‌రావు లేఖ రాశారు. వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాల్లో పీఎం ఫోటో ఎందుకు లేదంటూ మరో కేంద్ర మంత్రి మహేంద్ర నాథ్ పాండే ప్రశ్నించారు.

ఏపీ ప్రభుత్వంపై విమర్శలా?
ఏపీకి వచ్చే మంత్రులు కూడా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించే అవకాశం ఉందని భావిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం విజయవాడ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అధికార వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కొన్నాళ్లుగా తమ కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకొని ప్రచారం చేసుకుంటోందంటూ విమర్శిస్తున్నారు. ఈ సంఘటలన్నీ కూడా ఏపీలో బీజేపీ దూకుడుగా వెళ్లడానికి నిర్ణయించుకున్నట్లుగా స్పష్టమవుతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications