కూటమి మేనిఫెస్టో పై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు - సాధ్యం కాదు..!!
ఏపీలో టీడీపీ కూటమి మేనిఫెస్టో అంశం పైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. టీడీపీ, జనసేన మేనిఫెస్టోగా పేర్కొన్న చంద్రబాబు..అమలు బాధ్యత తాను, పవన్ తీసుకుంటామని వెల్లడించారు. మేనిఫెస్టోకు బీజేపీ మద్దతు ఉందని చెప్పుకొచ్చారు. అయితే, చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలు అమలు సాధ్యం కాదని సీఎం జగన్ చెబుతున్నారు.ఇదే సమయంలో చంద్రబాబు మేనిఫెస్టో గురించి బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
బీజేపీ నేత వ్యాఖ్యలు
ఏపీలో విడుదల చేసిన ఉమ్మడి మేనిఫెస్టోపై బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన విడుదల చేసిన మేనిఫెస్టోతో బీజేపీకి సంబంధమే లేదన్నారు. మేనిఫెస్టోలో సాధ్యంకాని, అలవికాని హామీలు ఉన్నాయని పేర్కొన్నారు. జగన్, చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోల్లో హామీలు అమలు సాధ్యం కావని చెప్పుకొచ్చారు. అమలు సాధ్యం కాని హామీల కారణంగానే బీజేపీ దూరంగా ఉందన్నారు. జగన్ గతంలో చెప్పినవి కొంత మేర చేయటంతో తిరిగి అవే కొనసాగిస్తున్నారన్నారు. కేంద్రంలో బీజేపీ ఇచ్చిన మేనిఫెస్టోలో వాస్తవికత ఉందని చెప్పారు.

అమలు సాధ్యం కాదు
చంద్రబాబు కూటమి మేనిఫెస్టోలో ప్రస్తావించిన అంశాలు చేయాలంటే ఆరు నెలల కాలంలోనే కొలాప్స్ అవుతుందని వ్యాఖ్యానించారు. 2014 ఎన్నికల సమయంలోనూ తాము తొలుత ఎన్నో అంశాలను మేనిఫెస్టోలో చేర్చామని..జాతీయ నాయకత్వం సూచనతో విరమించుకున్నామని చెప్పారు. ప్రజాకర్షక పథకాలను మేనిఫెస్టోలో ప్రస్తావించిన కారణంగానే వాటికి బీజేపీ దూరంగా ఉందని చెప్పుకొచ్చారు. మేనిఫెస్టోలో మైనార్టీలకు సంబంధించి ఇచ్చిన పథకాలకు బీజేపీ మద్దతు ఉందని తాను అనుకోవటం లేదని ఐవైఆర్ పేర్కొన్నారు.
బీజేపీ అందుకే దూరం
ఇదే సమయంలో బీజేపీ నేత జీవీఎల్ సైతం టీడీపీ, జనసేన మేనిఫెస్టో మాత్రమే అన్నారు. మోదీ ఇమేజ్‌ను ఏపీలో టీడీపీ, జనసేన సరిగా వాడుకోవడం లేదని జీవీఎల్ అసహనం వ్యక్తంచేశారు. ఏపీలో బీజేపీకి 18శాతం ఓటు బ్యాంక్ ఉందన్నారు. అనేక విషయాల్లో బీజేపీకి జాతీయ విధానం ఉన్నందునే ఉమ్మడి మేనిఫెస్టోలో భాగస్వామి కాలేదన్నారు. ప్రధాని మోదీ పేరుతో మరింతగా ప్రజల్లోకి వెళ్తే కూటమికి మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. టీడీపీ, జనసేన మేనిఫెస్టోకు పార్టీ పరంగా మద్దతు ఉంటుదన్నారు.












Click it and Unblock the Notifications