జగన్ తో స్నేహం, చంద్రబాబుతో పొత్తు - బీజేపీ మార్క్ రాజకీయం, కలిసొచ్చేదెవరికి..!!
ఏపీలో బీజేపీ కొత్త రాజకీయం ప్రారంభించింది. మిషన్ 400 సీట్ల పేరుతో ఏపీలో 25 సీట్ల పై గురి పెట్టింది. ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినా అన్నీ తమ కూటమి ఖాతాలో ఉండేలా బీజేపీ మార్క్ రాజకీయం ఏపీలో మొదలైంది. టీడీపీతో పొత్తు సంకేతాలు ఇస్తూనే..జగన్ తో స్నేహం కొనసాగిస్తోంది. ఇద్దరు నేతలు బీజేపీకి అవసరం. జగన్ తో స్నేహం కోరుకుంటూనే..చంద్రబాబుతో పొత్తు ఖాయం చేసుకుంటోంది. ఈ తాజా సమీకరణాలు ఏపీలో ఎన్నికల్లో ఎవరికి కలిసి వస్తాయి.
పొత్తుల లెక్కలు: బీజేపీ కి మాత్రమే సాధ్యమైన రాజకీయం ఏపీలో మొదలైంది. 2014 ఎన్నికల్లో టీడీపీ,బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసాయి. 2019 ఎన్నికల సమయంలో టీడీపీ నాడు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది. తిరిగి ఇప్పుడు ఎన్డీఏలో తిరిగి చేరేందుకు రంగం సిద్దమైంది. ఏపీలో టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన నాటి నుంచి జగన్ బీజేపీ ముఖ్యులకు దగ్గరయ్యారు.

2019లో విజయం సాధించిన తరువాత కేంద్రంలోని ముఖ్య నేతలతో సత్సంబంధాలు కొనసాగించారు. అవసరమైన సమయంలో కేంద్ర నిర్ణయాలకు మద్దతుగా నిలిచారు. కేంద్రం నుంచి జగన్ కోరిన విధంగా ఏపీకి సహకారం అందించారు. ఇక, ఇప్పుడు ఏపీలో తిరిగి టీడీపీతో పొత్తు దిశగా అడుగులు పడుతున్నాయి. ఇదే సమయంలో జగన్ తోనూ సంబంధాలు కొనసాగించేలా బీజేపీ ద్విముఖ వ్యూహం అమలు చేస్తోంది.
బీజేపీ రాజకీయం: చంద్రబాబుతో అమిత్ షా చర్చల తరువాత ఢిల్లీ నుంచి జగన్ కు పిలుపు వచ్చింది. ప్రధాని మోదీతో జగన్ సుదీర్ఘ భేటీ నిర్వహించారు. ఎంపీ సీట్లు ఇద్దరిలో ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినా తమ కూటమి నుంచి జారకుండా ముందస్తు చర్యలు ప్రారంభించారు. రాజ్యసభలో ప్రస్తుతం ఎన్నికల్లో మూడు స్థానాలు వైసీపీ గెలిస్తే రాజ్యసభలో వైసీపీ బలం 11కి చేరుతుంది.
బీజేపీ మూడో సారి కేంద్రంలో అధికారంలోకి వచ్చినా రాజ్యసభలో వైసీపీ మద్దతు అవసరం అవుతుంది. రాజ్యసభలో టీడీపీ పూర్తిగా ప్రాతినిధ్యం కోల్పోయే పరిస్థితి నెలకొంది. బీజేపీ ఎన్ని సీట్లు గెలిచినా బోనస్ అన్నట్లుగా ఏపీలో వ్యవహరిస్తోంది. మిగిలిన సీట్లలో రెండు పార్టీల్లో ఎవరు గెలిచినా తమకు మద్దతు ఉంటుందనేది బీజేపీ అంచనా.
ఎవరికి కలిసొచ్చేను: ఈ సమయంలోనే బీజేపీతో పొత్తుతో మైనార్టీ, ఆ పార్టీని సహజంగా వ్యతిరేకించే వర్గాల మద్దతు కోల్పోతామని టీడీపీలో భయం వెంటాడుతోంది. ఎన్డీఏలోకి జగన్ ఎటువంటి పరిస్థితుల్లో చేరే అవకాశం లేదు. బీజేపీ, జగన్ ఓట్ బేస్ పూర్తిగా విరుద్దం. ఇదే సమయంలో బీజేపీతో పొత్తు వేళ టీడీపీ నాడు ఎందుకు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిందీ.. ఇప్పుడు ఎందుకు చేరుతుందీ వివరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
బీజేపీ, జనసేనకు సీట్ల కేటాయింపు ద్వారా టీడీపీలో మెజార్టీ సీట్లు త్యాగం చేయాల్సి ఉంటుందని సీనియర్లే చెబుతున్నారు. ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. బీజేపీతో పొత్తుతో జగన్ అమలు చేస్తున్న సామాజిక సమీకరణాలకు ధీటుగా సీట్లు కేటాయించే అవకాశాలు చంద్రబాబుకు సన్నగిల్లుతాయి. ఇక.. జగన్ ఒక్కరిపైన ఇంత మంది కలిసి పోటీ చేస్తున్నారనే ప్రచారం మొదలైంది. దీంతో, బీజేపీ తమకు లాభం కలిగేలా ఏపీలో అమలు చేస్తున్న రాజకీయం ఎన్నికల సమయానికి ఎలాంటి టర్న్ తీసుకుంటుందీ..ఎవరికి మేలు చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications