బాబుకు బీజేపీ చురక, కేసీఆర్ వాదన సరికాదు, లక్షల కోట్ల ఖర్చు: టీజీ
రాజమహేంద్రవరం: కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్షకు మద్దతు పలికిన బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ అధికార టిడిపికి గురువారం చురకలు అంటించారు. ముద్రగడ విషయంలో ప్రభుత్వం మొదటి నుంచి వ్యతిరేకతతోనే వ్యవహరించిందని అభిప్రాయపడ్డారు.
అది కాపు ఉద్యమాన్ని అణిచివేసేందుకు చేసిన ప్రయత్నంగా కాపులు భావిస్తున్నారన్నారు. అటువంటి ఆలోచనలు, ప్రయత్నాలు చేస్తే ఏమవుతుంతో తెలుసుకోవాలంటే, దేశంలో ఎమెర్జన్సీ రోజుల తర్వాత జరిగిన పరిణామాలను గుర్తుంచుకోవాలన్నారు.
ముద్రగడ కుటుంబం పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని చెబుతున్నారని, ఇది సరికాదన్నారు. ముద్రగడ దీక్ష నేపథ్యంలో.. ఎవరు పైచేయి సాధించారనేది అనవసరమన్నారు. ముద్రగడ, ఆయన కుటుంబ సభ్యుల పట్ల పోలీసులు కొంచెం కటువుగానే వ్యవహరించారని వీడియో క్లిప్పింగులు చూస్తుంటే అర్థమవుతోందన్నారు.
జగన్ వద్దకు దొంగల ముఠా: సోమిరెడ్డి

నాడు వైయస్ రాజశేఖర రెడ్డి పక్కన ఉండి, రాష్ట్రాన్ని దోచుకున్న దొంగల ముఠా ఇప్పుడు వైసిపి అధినేత జగన్ వద్దకు చేరిందని టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. వైసిపి కారణంగానే కాపులు జైలుకెళ్లారని అన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ భాష తీరు మార్చుకోవాలని, చంద్రబాబు మోసగాడని భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడటం సరికాదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులకు అండగా ఉందని, వైయస్ హయాంలో 23 జిల్లాల్లో రూ.1100 కోట్లు రుణమాఫీ చేశారని, చంద్రబాబు 13 జిల్లాల్లో రెండు విడతల్లో రూ.11 వేల కోట్ల రుణమాఫీ చేశారన్నారు.
లక్షల కోట్లు ఖర్చు పెట్టారు: టిజి వెంకటేష్
సమైక్య ఏపీలో తెలంగాణకు లక్షల కోట్లు ఖర్చు పెట్టారని మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ గురువారం నాడు అన్నారు. తెలంగాణ కార్పోరేషన్ల నుంచి ఏపీకి వేల కోట్లు రావాల్సి ఉందని చెప్పారు. దీని పైన బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. నీటి వివాదం పైన అర్థం లేని వాదనలు చేస్తున్నారన్నారు. ఏపీ భవన్ పైన సీఎం కేసీఆర్ వాదన సరికాదన్నారు.












Click it and Unblock the Notifications