టీడీపీ ,జనసేనతో బీజేపీ పొత్తు - కీలక మలుపు..!!
ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. 2024 ఎన్నికల దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ - జనసేన పొత్తు ఖాయమైంది. బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని పవన్ కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేసారు. ఇప్పటి వరకు టీడీపీతో కలిసేందుకు బీజేపీ నేతలు ససేమిరా అన్నారు. కానీ, సడన్ గా మార్పు మొదలైంది. కర్ణాటక ఎన్నికల తరువాత ఇప్పుడు బీజేపీ కొత్త నిర్ణయాల ప్రకటనకు సిద్దం అవుతోంది. పొత్తుల విషయంలో కొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి.
2024 ఎన్నికల పొత్తులు : ఏపీలో 2014 పొత్తుల ఫార్ములా మరోసారి అమలు చేయాలని టీడీపీ, జనసేన భావిస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే పవన్ కల్యాణ్ స్పష్టమైన ప్రకటన చేసారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఖాయమని ప్రకటించారు. టీడీపీ, బీజేపీతో కలిసి అన్నీ బాగుంటే పొత్తు ఖాయమవుతుందని స్పష్టం చేసారు. ఇదే అంశం పైన బీజేపీ ముఖ్య నేతలతో పవన్ మంత్రాంగం నడిపారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా మూడు పార్టీలు కూటమిగా పోటీ చేయాలని ప్రతిపాదించారు. ఇప్పటి వరకు టీడీపీతో పొత్తు విషయంలో బీజేపీ నేతలు ససేమిరా అంటూ వచ్చారు. కానీ, ఇప్పుడు వాయిస్ లో కొంత మార్పు కనిపిస్తోంది. జీవీఎల్, సోము వీర్రాజు వంటి నేతలు పవన్ ప్రతిపాదన పైన గతం కంటే భిన్నంగా స్పందించారు.

మూడు పార్టీలు కలుస్తాయా : పవన్ కల్యాణ్ తో తమ పొత్తు కొనసాగుతుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు స్పష్టం చేసారు. ఇప్పుడు కొత్తగా టీడీపీని కూడా కలుపుకోవాలనేది పవన్ ప్రతిపాదనగా చెప్పుకొచ్చారు. ఎవరితో కలవాలి.. ఎవరితో వద్దు అనేది పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని జీవీఎల్ చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు జీవీఎల్ టీడీపీతో పొత్తు అవకాశమే లేదని పలు సందర్భాల్లో స్పష్టం చేసారు. పవన్ నేరుగా ఇదే అంశాన్ని పార్టీ ముఖ్య నాయకత్వంతో మాట్లాడుతున్నారని తొలి సారి వెల్లడించారు. తాము పవన్ ప్రతిపాదన గురించి హైమాండ్ కు నివేదిస్తామని వివరించారు. అదే విధంగా పవన్ చేసిన ప్రతిపాదన గురించి తాము కేంద్ర నాయకత్వంకు వివరిస్తారని సోము వీర్రాజు చెప్పుకొచ్చారు.

బీజేపీ అంగీకరస్తుందా: ఇలా, ఇప్పటి వరకు టీడీపీతో పొత్తు పైన వ్యతిరేకంగా స్పందించిన నేతలు ఒక్క సారిగా మొత్తబడినట్లు కనిపిస్తోంది. పొత్తు నిర్ణయం పైన స్పందించకపోయినా.. పార్టీ నాయకత్వం పరిశీలిస్తుందనే సానుకూల సంకేతాలు ఇస్తున్నారు. ఇదే సమయంలో పవన్ వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీలు కలుస్తాయని గట్టిగా చెబుతున్నారు. ఒప్పుకోకపోయినా ఒప్పిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కర్టాటక ఫలితాల తరువాత పొత్తులు బీజేపీకి అవసరమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇదే సమయంలో బీజేపీతో పొత్తులు అవసరమా అనే చర్చ కూడా మొదలైంది. ఈ క్రమంలో ఏపీలో పొత్తుల వ్యవహారం పైన మరో వారం రోజుల్లో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications