మీరెలా అంటే అలా
Chandrababu Naidu: విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మినహా ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ఏదీ లేదు. రెండు నెలల కిందటే ఈ ప్రక్రియ మొత్తం ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు దాటింది.
జూన్ 12వ తేదీన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు మొత్తం కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రెండు నెలల వ్యవధిలో చంద్రబాబు ప్రభుత్వం ఎదుర్కొనబోతోన్న తొలి ఎన్నిక.. విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీదే.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పోటీలో నిలిచారు. టీడీపీ- జనసేన- బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. ఇంకా తమ అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. నామినేషన్లను దాఖలు చేయడానికి నేడే తుదిగడువు. బొత్స సత్యనారాయణ సోమవారమే నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ అభ్యర్థి ఇంకా ఖరారు కావాల్సి ఉంది.
ఈ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టాలా? వద్దా? అనే విషయంపై ఇప్పటి వరకు టీడీపీ- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి నేతల మధ్య ఏకాభిప్రాయం రాలేదు. ఫలితంగా- పోటీ పైనే సందేహాలు వ్యక్తమౌతోన్నాయి. విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి మొత్తం కలిసినప్పటికీ.. అభ్యర్థిని గెలిపించుకునే బలం లేదు. ఈ నేపథ్యంలో టీడీపీ పోటీపై గందరగోళం నెలకొంది.

ఈ పరిణామాల మధ్య బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి లోక్‌సభ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి.. చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఉండవల్లి నివాసంలో ఈ సమావేశం ఏర్పాటైంది. ఆ సమయంలో పురందేశ్వరితో పాటు బీజేపీ సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ ఉన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై కూటమి భాగస్వామ్య పార్టీ బీజేపీ అభిప్రాయాన్ని తీసుకోవడానికే ఈ భేటీ జరిగిందని అంటున్నారు. అభ్యర్థిని నిలబెట్టడంపై తుది నిర్ణయాన్ని చంద్రబాబుకే వదిలివేశారని తెలుస్తోంది. అలాగే- రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, అభివృద్ధికి సంబంధించిన అంశాలపై వారు చర్చించారు.












Click it and Unblock the Notifications