మా హామీలు సరే.. మీ హామీల సంగతేంటి : బీజేపీ సూటి ప్రశ్న
మిత్రపక్షాలయినంత మాత్రానా పీకలదాకా వస్తే చూస్తూ ఊరుకుంటాయా.. అధికారాన్ని పంచుకోవడంలో పొత్తును కోరుకుంటూనే, నిందల్ని మాత్రం తమ నెత్తిన వేయడం ఇక ఎంతమాత్రం సహించేది లేదన్న రీతిలో వ్యవహరిస్తోంది బీజేపీ. హోదాతోనే అన్ని సమస్యలు పోవని వ్యాఖ్యనించిన చంద్రబాబు గత వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. టీడీపీ తప్పుల పట్ల ఇక చూసీ చూడని ధోరణితో వ్యవహరిస్తే లాభం లేదనే నిర్ణయానికి బీజేపీ వచ్చినట్టుగా తెలుస్తోంది.
ప్రత్యేక హోదా విషయంలో బీజేపీని దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్న టీడీపీకి మిత్రపక్షం బీజేపీ ఇప్పుడు గట్టి కౌంటరే ఇస్తోంది. టీడీపీ నేతల విమర్శించలకు స్పందించకపోతే ఏపీ ప్రజలు నిజంగానే బీజేపీ రాష్ట్రానికి ద్రోహం చేస్తోందని భావించే అవకాశం ఉన్నందున టీడీపీ నేతల విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ నేతలు. అసలు విభజన హామీల్లోనే లేని ప్రత్యేక హోదాను తామెక్కడి నుంచి తీసుకొస్తామని.. బీజేపీని విమర్శించే ముందు ఒకసారి టీడీపీ ఇచ్చిన ఎన్నికల హామీ గురించి కూడా గుర్తు చేసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు బీజేపీ నేతలు.

ఏపీ ప్రభుత్వంలో తాము భాగస్వాములమేనని చెప్తున్న బీజేపీ.. ప్రభుత్వ హామీలపై ప్రజలు బీజేపీని ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలని నిలదీశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భ్రుతి, సంపూర్ణ రుణమాఫీ వంటి పథకాలను టీడీపీ ఏ మేరకు ఆచరణలో పెట్టిందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని రుణాలు మాఫీ చేశారు లాంటి లెక్కలన్ని బయటపెట్టాలంటున్నారు కమలనాథులు. మా హామీలు సరే.. మరి మీ హామీల మాటేంటని ప్రశ్నిస్తున్న బీజేపీకి టీడీపీ ఇప్పుడు ఏం సమాధానం చెప్తుందో..!












Click it and Unblock the Notifications