సెంటిమెంట్ కలిసొస్తే - అదే ఫలితం రిపీట్...!!
ఏపీలో ప్రతీ సీటులోనూ పోటీ హోరా హోరీగా మారుతోంది. 2019 తరహా ఎన్నికల ఫలితాలను రిపీట్ చేయాలనేది జగన్ లక్ష్యం. తిరిగి అధికారం దక్కించుకోవాలనేది చంద్రబాబు వ్యూహం. జనసేన, బీజేపీ తో కలిసి మూడు పార్టీల కూటమిగా బరిలో దిగారు. కాంగ్రెస్ వామపక్షాలతో కలిసి పోటీ చేస్తున్నాయి. కీన్ కంటెస్ట్ ఉన్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కూటమి దక్కించుకొనే ఓట్లు కీలకం కానున్నాయి. బీజేపీ పోటీ చేస్తున్న ఎంపీ స్థానాల్లో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి.
త్రిముఖ పోరు
అరకు పార్లమెంటు నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. వైసిపి, బిజెపి, సిపిఎం అభ్యర్థుల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు, అరకు, పాడేరు, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వైసిపి ఎంపి అభ్యర్థిగా గుమ్మ తనూజరాణి, బిజెపి అభ్యర్థిగా కొత్తపల్లి గీత, సిపిఎం అభ్యర్థిగా పాచిపెంట అప్పలనర్స బరిలో ఉన్నారు. టిడిపి, జనసేన బిజెపి కూటమి నుంచి పోటీ చేస్తున్న కొత్తపల్లి గీతపై గిరిజనుల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఒక దఫా ఎంపిగా ఎన్నికై తమను పట్టించుకోలేదన్న విమర్శలు ఆమెపై ఉన్నాయి. వైసిపి నుంచి అరకు ప్రస్తుత ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ కోడలు డాక్టర్ గుమ్మ తనూజరాణి బరిలో ఉన్నారు.

పార్టీల బలమే కీలకం
వైసీపీ అభ్యర్ది తనూజ రాజకీయాలకు పూర్తిగా కొత్త. సిపిఎం అభ్యర్థిగా బరిలో ఉన్న పి అప్పలనర్స ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. అల్లూరి జిల్లాలో అరకు, పాడేరు, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. గతంలో వీటిని వైసిపి కైవసం చేసుకుంది. ప్రస్తుతం అరకు అసెంబ్లీ నుంచి వైసిపి అభ్యర్థిగా రేగం మత్స్యలింగం, కూటమి అభ్యర్థిగా బిజెపి నుంచి పాంగి రాజారావు బరిలో ఉన్నారు. బిజెపి అభ్యర్థికి టిడిపి శ్రేణులు సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. దొన్నుదొర ఇండిపెండెంటుగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. వైసిపి అభ్యర్థి రేగం మత్స్యలింగం పార్టీలో గ్రూపుల పోరుతో సతమతమవుతున్నారు. ఇండియా వేదిక తరఫున కాంగ్రెస్ నుంచి శెట్టి గంగాధర స్వామి బరిలో ఉన్నారు.
గెలుపు దక్కేదెవరికి
స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమైన సివేరి అబ్రహం కూడా ప్రభావం చూపుతారు. ఆయన మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుమారుడు. టిడిపి టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. పాడేరులో ముగ్గురు అభ్యర్దుల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇక్కడ టీడీపీ అభ్యర్దిని మార్చుతారని..గిడ్డి ఈశ్వరికి ఛాన్స్ దక్కుతుందనే ప్రచారం ఉంది. రంపచోడవరం నియోజకవర్గానికి సంబంధించి మిరియాల శిరీషా దేవిని టిడిపి అధినేత చంద్రబాబు ప్రకటించారు. వైసిపి అభ్యర్థిగా సిట్టింగు ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి బరిలో ఉన్నారు. ఆమెపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. పోలవరం నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యం చెందారన్న విమర్శలు ఉన్నాయి. దీంతో..అరకు పార్లమెంట్ లో ఈ సారి గెలుపు దక్కేదెవరికి అనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications