పిక్చర్స్: గుడ్డి టీచర్ ఇలా విద్యార్థిని చితకబాదాడు
కాకినాడ: ప్రభుత్వ గుర్తింపు లేని ఓ ప్రైవేటు విద్యా సంస్థ కరస్పాండెంట్ అభం శుభం తెలియని అంధ విద్యార్థులను గొడ్డును బాదినట్టు బాది, చిత్ర హింసలకు గురి చేసిన వైనం తీవ్ర సంచలనం సృష్టించింది. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ రూరల్ మండలం అచ్చంపేట జంక్షన్‌కు సమీపంలో గల గ్రీన్‌ఫీల్డ్ అంధ వికలాంగ విద్యార్థుల పాఠశాలలో నాలుగు రోజుల క్రితం ఈ ఘాతుకం చోటుచేసుకుంది.
స్థానిక అచ్చంపేట సమీపంలో సొసైటీ రిజిస్ట్రేషన్ మాత్రమే కలిగివున్న గ్రీన్‌ఫీల్డ్ సంస్థ అంధ, వికలాంగ విద్యార్థుల కోసం ఓ విద్యా సంస్థను నిర్వహిస్తోంది. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 50 మంది అంధ విద్యార్థులకు ఇక్కడ చదువుతో పాటు వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తారు. దాతల నుండి విరాళాలు సేకరించి పక్కా భవనాన్ని నిర్మించి ఈ విద్యా సంస్థను నిర్వహిస్తున్నారు. ఘటనాస్థలికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, జిల్లా విద్యాశాఖాధికారి కెవి శ్రీనివాసులురెడ్డి తదితరులు హుటాహుటిన వెళ్లి బాధిత విద్యార్థులతో మాట్లాడారు. వారిని జిల్లా విద్యాశాఖాధికారి పర్యవేక్షణలో ఉంచారు.
అంధ విద్యార్థులను తీవ్రంగా కొట్టి గాయపరిచిన పాఠశాల కరస్పాండెంట్ కెవి రావు, ప్రిన్సిపాల్ శ్రీనివాసరావును కాకినాడ రూరల్ పోలీసులు అరెస్టు చేశారని జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ చెప్పారు. ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణకు కాకినాడ ఆర్‌డిఒ బిఆర్ అంబేద్కర్‌ను నియమించామన్నారు. స్వచ్ఛంద సంస్థ పర్యవేక్షణలో ఉన్న ఈ పాఠశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఒక ఉపాధ్యాయుడిని నియమించనున్నట్టు చెప్పారు.

గుడ్డి కరస్పాండెంట్ ఇలా
పాఠశాల సెక్రటరీ-కరస్పాండెంట్ కెవి రావు కూడా అంధుడే. శ్రీనివాసరావు ప్రిన్సిపాల్‌గా ఉన్నారు. కరస్పాండెంట్ రావు ఈనెల 18న క్రమశిక్షణ పేరుతో ముగ్గురు అంధ విద్యార్థులను చితకబాదిన ఘటన వెలుగులోకి వచ్చింది.

గుడ్డి కరస్పాండెంట్ ఇలా
విద్యార్థులను రావు బెత్తంతో మీదపడి కొట్టడాన్ని గుర్తుతెలియని వ్యక్తి సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. అది వెలుగులోకి రావడంతో జాతీయ స్థాయిలో సంచలనం చెలరేగింది.

దిక్కు మొక్కు లేక ఇలా..
బాధిత విద్యార్థులు బయటకు చెప్పుకునే అవకాశం లేక కుమిలిపోతున్న నేపథ్యంలో మొబైల్‌లో దృశ్యాలను చిత్రీకరించిన వ్యక్తి ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు లీక్ చేయడంతో ఈ వ్యవహారం సోమవారం వెలుగు చూసింది.

కరస్పాండెంట్‌కు దేహశుద్ధి
టీవీ ఛానళ్లలో అంధ విద్యార్థులను కిరాతకంగా హింసిస్తున్న తీరును చూసిన స్థానికులు, బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఆగ్రహంతో మండిపోయి విద్యా సంస్థపై దాడిచేసి కరస్పాండెంట్ కెవి రావుకు దేహశుద్ధి చేశారు.

అంధ విద్యార్థుల బాధ
అంధ విద్యార్థుల బాధ వర్ణనాతీతంగా ఉండడంతో సెల్ ఫోన్‌తో తీసిన వీడియోను లీక్ చేశారు. దీంతో దేశవ్యాప్తంగా అది చర్చనీయాంశంగా మారింది.

పాఠశాల స్వాధీనం
నిర్వాహకులను అరెస్టు చేసిన నేపథ్యంలో సుమారు 50 మంది అంధ, వికలాంగ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ సంస్థను ప్రభుత్వ ఆధీనంలో నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన చెప్పారు












Click it and Unblock the Notifications