సముద్రంలో పడవ బోల్తా: తల్లితో సహా ఇద్దరు పిల్లలు గల్లంతు
గుంటూరు: ఓ పడవ బోల్తా పడిన ఘటనలో తల్లితో సహా ఇద్దరు చిన్నారులు గల్లంతయ్యారు. ఈ ఘటన బాపట్ల జిల్లాలో చోటు చేసుకుంది. నాగాయలంక మండలం ఎలచెట్లదిబ్బ గ్రామానికి చెందిన కొక్కిలిగడ్డ సోంబాబు భార్య, ఇద్దరు పిల్లలను తీసుకుని.. ముత్తాయపాలెం వద్ద బోటులో సముద్రంలోకి వేటకు వెళ్లారు.
నిజాంపట్నం హార్బర్ తీర సమీపానికి రాగానే పడవ బోల్తాపడింది. దీంతో బోటులో ఉన్న వారందరూ సముద్రంలో పడిపోయారు. బోటులోని భార్య సాయి వర్ణిక (25), కుమారులు తనీష్ కుమార్(7), తరుణేశ్వర్(1) సముద్రంలో గల్లంతయ్యారు. భర్త సోంబాబు మాత్రం ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు.

వేటకు వెళ్లిన మత్స్యకారులు బోల్తాపడిన బోటును చూసి.. మత్స్య శాఖ అధికారులకు సమాచారం అందించారు. అలల ఉద్ధృతికి పడవ బోల్తా పడిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు సోంబాబు. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు గల్లంతైన వారి కోసం.. మత్స్యకారుల సహాయంతో సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు.
పెద్దలు ఒప్పుకోలేదని ప్రేమ జంట ఆత్మహత్య
తిరుమల జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం బాకరాపేట అటవీ ప్రాంతంలో ఓ ప్రేమ జంట ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పశువుల కాపర్లు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగుచూసింది. మృతురాలిని చిట్టెంవారి పల్లెకు చెందిన కళ్యాణిగా గుర్తించగా, మృతుడు యుగంధర్.. చౌడేపల్లి మండలం లద్దికం గ్రామ వాసిగా తేల్చారు.
వీరిద్దరూ ఆగస్టు 18న ప్రేమ వివాహం చేసుకున్నారని.. అయితే, ఇంట్లో పెద్దలు అంగీకరించకపోవడంతో బాకరా అటవీ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు. చిత్తూరు జిల్లా పుంగనూరులోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నట్లు వెల్లడించారు. ఘటనపై వారి కుటుంబసభ్యులకు సమచారం అందించిన పోలీసులు.. ఇద్దరి మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కళ్యాణి, యుగంధర్ మృతితో వారిరువురి కుటుంబాల్లో విషాదం నెలకొంది.












Click it and Unblock the Notifications