బాబు షరతు పెట్లేదు: పురంధేశ్వరిపై వెంకయ్య, బొత్సపై
హైదరాబాద్/న్యూఢిల్లీ: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ మాజీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ బొత్స సత్యనారాయణ భారతీయ జనతా పార్టీలో చేరనున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఇటు బొత్స, అటు బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడులు గురువారం స్పష్టత ఇచ్చారు. తాను బిజెపిలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను బొత్స ఖండించారు. తాను కాంగ్రెసు పార్టీని వీడటం లేదన్నారు.
మరోవైపు దీనిపై వెంకయ్య నాయుడు హైదరాబాదులో మాట్లాడుతూ.. బొత్స తనతో టచ్‌లో ఉన్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. తనతో టచ్‌లో లేరన్నారు. ఇంకా ఎవరితోనైనా టచ్‌లో ఉంటే తనకు తెలియదన్నారు. ఒక పార్టీలో ఉన్న వారి గురించి తాను మాట్లాడదల్చుకోలేదన్నారు. వారు పార్టీ వీడాక మాట్లాడుతానని చెప్పారు.

పురంధేశ్వరి టిక్కెట్ షరతులపై....
మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరికి టిక్కెట్ ఇవ్వవద్దని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు షరతు పెట్టినట్లుగా వచ్చిన వార్తల పైనా వెంకయ్య స్పందించారు. పురంధేశ్వరికి టిక్కెట్ ఇవ్వవద్దని చంద్రబాబు ఎలాంటి షరతు పెట్టలేదన్నారు. ఆ వార్తలు అన్నీ కల్పితమే అన్నారు.
కాగా, రానున్న సార్వత్రిక ఎన్నికలలో బిజెపి, టిడిపిలు కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్న విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా తెలంగాణ ప్రంతంలో బిజెపికి 50 ఎమ్మెల్యే, 8 ఎంపీ, సీమాంధ్రలో 22 ఎమ్మెల్యే, 5 ఎంపీ స్థానాలు ఇచ్చేందుకు టిడిపి సిద్ధమైనట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే పురంధేశ్వరికి టిక్కెట్ ఇవ్వవద్దని చంద్రబాబు షరతు పెట్టినట్లుగా ప్రచారం జరిగింది. దీనిని వెంకయ్య కొట్టి పారేశారు.












Click it and Unblock the Notifications