ఉద్యోగ నేతలతో బొత్స, సజ్జల చర్చలు-ఉద్యమం వద్దని వారింపులు-రెబెల్ సూర్యనారాయణకు అందని పిలుపు...
ఏపీలో పెండింగ్ సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహంగా ఉన్న ఉద్యోగ సంఘాలు మార్చి 9 నుంచి ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ ఉద్యోగ నేతలతో చర్చలు జరుపుతోంది.
ఏపీలో ఉద్యోగులకు వైసీపీ సర్కార్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, జీత భత్యాలు, పెన్షన్లు సకాలంలో చెల్లించకపోవడం, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి హామీలు నెరవేర్చలేదు. దీంతో ఉద్యోగ నేతలు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే మార్చి 9 నుంచి ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమానికి సిద్ధం కాగా.. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏప్రిల్ నుంచి ఉద్యమంలోకి దిగుతున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ తమకు అనుకూలంగా ఉన్న ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరుపుతోంది.
ఏపీలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై వారు ఉద్యమానికి సిద్దమవుతున్న నేపథ్యంలో విద్యామంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఉద్యోగుల సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి ఇవాళ ఉద్యోగ నేతలతో భేటీ అయ్యారు. విజయవాడలోని మంత్రి బొత్స నివాసంలో జరుగుతున్న ఈ భేటీకి సజ్జల, చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు (ఏపీ జేఏసీ అమరావతి), బండి శ్రీనివాసరావు (ఏపీ ఎన్జీవోలు), వెంకట్రామిరెడ్డి (సచివాలయ ఉద్యోగుల సంఘం)ని ఆహ్వనించారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఉద్యోగుల అభిప్రాయాన్ని మంత్రి బొత్స, సజ్జల, చంద్రశేఖర్ రెడ్డి వీరి నుంచి తెలుసుకుంటున్నట్లు తెలుస్తోంది.

అయితే మంత్రి బొత్స, సజ్జల ఈ సమావేశాన్ని ఉద్యోగ నేతలతో విడివిడిగా నిర్వహిస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ఆయా నేతలతో వీరు విడివిడిగా చర్చిస్తున్నారు. ఇప్పటికే ఈ నెల 9నుంచి ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన నేపథ్యంలో దీని ప్రభావం ఉద్యోగులపై ఎలా ఉందనే అంశంపై వీరు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. దీని ఆధారంగా ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముందుగా సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులతో సమావేశమైన బొత్స, సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి.. అనంతరం మిగిలిన నేతలతో మాట్లాడుతున్నారు. అయితే ఈ సమావేశానికి ప్రభుత్వంతో విభేదిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణను ఆహ్వానించలేదు.












Click it and Unblock the Notifications