మా వాదన వినండి: సోనియాకి బొత్స లేఖ, డిగ్గీకి ఫోన్

తెలంగాణపై నోట్ కేంద్ర కేబినెట్ ముందుకు రావడంతో జాప్యం కావొచ్చుననే అభిప్రాయం వ్యక్తమవుతోందని, దానికి ముందు సీమాంధ్ర ప్రజల మనోభావాలను వినేందుకు అధిష్టానం ఒక కమిటీని పంపాలని కాంగ్రెసు నాయకులు కోరుతున్నారని, ఇందులో భాగంగా త్రిసభ్య కమిటీగా వీరప్ప మొయిలీ, సుశీల్ కుమార్ షిండే, దిగ్విజయ్ సింగ్‌లను పంపాలని సోనియాకు రాసిన లేఖలో బొత్స కోరారు. రాష్ట్రానికి ఎకె ఆంటోని కమిటీని వెంటనే పంపించాలని కోరారు.
సమైక్యతను కోరుతూ సీమాంధ్రులు చేస్తున్న ఉద్యమం అరవై రోజులు దాటిందని, ఉద్యమం కొనసాగుతుండగానే మరోవైపు అక్టోబర్ 3న జరగనున్న కేంద్ర మంత్రివర్గ సమావేశానికి తెలంగాణ నోట్ రావొచ్చుననే భావన వ్యక్తమవుతోందని, సీమాంధ్ర ప్రజల ఆందోళనను పట్టించుకోకుండా ముందుకు వెళ్లడం సరైంది కాదని, వారి వాదనలు వినేందుకు ఢిల్లీ నుండి కమిటీని పంపించాలని కోరారు.
రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో రాయలసీమ, కోస్తా ఆంధ్ర ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్యమం మొదలైందని, వివిధ రంగాలలో ప్రజలు ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నారని, ఎపిఎన్జీవోలు నాయకత్వం వహిస్తున్నారని చెప్పారు. ఓ మంత్రి ఇప్పటికే రాజీనామా సమర్పించారని, అయిగురు ఎంపీలు రాజీనామాలు సమర్పించారని, పలువురు ప్రజాప్రతినిధులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారని, చేరుతున్నారని పేర్కొన్నారు. సున్నిత అంశం కాబట్టి ప్రజలతో మాట్లాడాలన్నారు.
అదే సమయంలో దిగ్విజయ్ సింగ్‌కు ఫోన్ చేసి రాష్ట్రానికి రావాల్సిందిగా బొత్స సోనియా గాంధీతో మాట్లాడతానని దిగ్విజయ్ సింగ్ పిసిసి చీఫ్‌కు భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications