మంత్రి రోజాపై పెనుగంచిప్రోలు స్టేషన్ లో ఫిర్యాదు
తనదైన శైలిలో రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడే ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆమెపై బుడబుక్కల సంఘం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల ఒక సమావేశంలో రోజా మాట్లాడుతూ తమ కులాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని, ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
బుడబుక్కలవారంటూ : రెండు రోజుల క్రితం కృష్ణా జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి రోజా మాట్లాడుతూ రాజకీయ ప్రత్యర్థులు బుడబుక్కల వాళ్లంటూ వ్యాఖ్యలు చేశారు. అలా తమ కులాన్ని కించపరిచే హక్కు ఆమెకు ఎవరిచ్చారంటూ సంఘం నాయకులు మండిపడుతున్నారు. రోజా బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పెనుగంచిప్రోలు బుడబుక్కల సంఘం అధ్యక్షుడు ఎర్ర అబ్బాయి రోజాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దుమారం రేగింది : కృష్ణా జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి రోజా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లను విమర్శించే క్రమంలో చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే పెద్ద దుమారం రేగింది. పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లను విమర్శించడంతోపాటు వారిద్దరినీ బుడబుక్కల వారితో పోలుస్తూ ఘాటు విమర్శలు చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో బుడబుక్కల సంఘం నాయకులు మంత్రి కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
అసంకల్పితంగా : రాజకీయ నాయకులే కాకుండా ఎవరైనా సరే.. ఏ విధంగాను ఒక కులాన్నికానీ, ఒక సంఘాన్ని కానీ విమర్శించకూడదనే నిబంధనలున్నాయి. అయితే కొందరు నాయకులు మాట్లాడుతూ అసంకల్పితంగా నోరు జారడం లేదంటే కావాలని ఉద్దేశించి మాట్లాడటం చేసేవారు. ఈ క్రమంలోనే రాజకీయ నాయకులు పలువురు ఇబ్బందులను ఎదుర్కోవడంతోపాటు మరికొందరు కోర్టు కేసులను ఎదుర్కొన్నారు. తాజాగా రోజా చేసిన వ్యాఖ్యల ప్రభావం చిలికి చిలికి గాలివానలా మారుతోంది.












Click it and Unblock the Notifications