వినే తీరిక చంద్రబాబు గారికి లేదు- బుద్ధా వెంకన్న షాకింగ్ కామెంట్స్
Buddha Venkanna: ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు విశాఖపట్నంలో 60 ఎకరాల భూ కేటాయింపు వ్యవహారం రాజకీయరంగు పులుముకుంది. విశాఖ ఐటీ పార్క్‌లో 3.5 ఎకరాలు, కాపులుప్పాడ వద్ద 56.36 ఎకరాలను ప్రభుత్వం కేటాయించడం వెనుక అక్రమాలు చోటు చేసుకున్నాయని విజయవాడకు చెందిన లోక్‌సభ మాజీ సభ్యుడు కేశినేని నాని ఆరోపించారు.
టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (TCS)కు భూమి కేటాయించడాన్ని ప్రశంసించారు నాని. ఇది- పలు ఐటీ దిగ్గజ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించడానికి, వేల సంఖ్యలో ఉద్యోగాలను కల్పించడానికి, తద్వారా రాష్ట్రాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు దార్శనికతకు ఇది అద్దం పట్టిందని పేర్కొన్నారు.

అదే సమయంలో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు భూముల కేటాయింపు ప్రక్రియను కేశినేని తప్పుపట్టారు. అనేక అనుమానాలను వ్యక్తం చేశారు. ఈ సంస్థకు 60 ఎకరాల భూమి కేటాయింపుపై విధానంపై అనుమానాలు వ్యక్తమౌతోన్నాయని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు చంద్రబాబుకు లేఖ రాశారు. తన ఫేస్‌బుక్ అధికారిక అకౌంట్‌లో ఈ సమాచారాన్ని పోస్ట్ చేశారు. ఉర్సా క్లస్టర్స్ సంస్థ ఏర్పాటైన కొన్ని వారాలకే భారీ ఎత్తున భూమిని కేటాయించడం సహేతుకం కాదని అన్నారు. ఈ సంస్థకు ఎలాంటి అనుభవం లేకపోవడం, భారీ ప్రాజెక్టులను అమలు చేయడానికి తగిన నేపథ్యం లేకపోవడాన్ని ఆయన ఎత్తి చూపారు.
సంస్థ డైరెక్టర్లలో ఒకరైన అబ్బూరి సతీష్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి అత్యంత సన్నిహితుడని, కాలేజీలో కలిసి చదువున్నారని నాని తెలిపారు. 21 సెంచరీ ఇన్వెస్టిమెంట్స్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలో భాగస్వామ్యులుగా ఉండేవారని గుర్తు చేశారు. ఆ సంస్థ ప్రజల నుండి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసగించిందనే ఆరోపణలు ఉన్నాయని చెప్పారు.
ఉర్సా క్లస్టర్స్‌కు భూ కేటాయింపుల వెనుక కేశినేని చిన్ని ప్రమేయం ఉందని నాని ఆరోపించారు. ఎంపీగా, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆయన తన పలుకుబడిని ఉపయోగించి ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని అన్నారు. ఇసుక, ఫ్లై యాష్, గ్రావెల్ మైనింగ్, క్యాసినో, రియల్ ఎస్టేట్ మాఫియాల్లో చిన్ని ప్రమేయం ఉందని విమర్శించారు.

దీనిపై విజయవాడకే చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఘటుగా రియాక్ట్ అయ్యారు. కేశినేని నాని చేసిన విమర్శలను తప్పుపట్టారు. కేశినేని చిన్నిపై ఆరోపణలు చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎదురుదాడికి దిగారు.
ఎంపీ సీట్ ఇవ్వలేదనే కారణంతో మొదటి నుండి సొంత తమ్ముడిపై నాని ఏదో ఒక ఆరోపణలు చేస్తూనే ఉన్నాడని బుద్ధా వెంకన్న గుర్తు చేశారు. గతంలో సొంత తమ్ముడి భార్యపైనే కేసు పెట్టాడని విమర్శించారు. ఇప్పుడు చంద్రబాబు చేస్తోన్న రాష్ట్రాభిభివృద్ధికి నిలువునా అడ్డుపడుతున్నాడంటూ మండిపడ్డారు.
కేశినేని శివనాథ్ (చిన్ని) ఇంజినీరింగ్ క్లాస్ మెట్ కంపెనీకి ల్యాండ్ ఇవ్వకూడదు అని నాని అడ్డుపడుతున్నాడని ధ్వజమెత్తారు. బ్యాంకులకు రుణాలు కట్టవలసి వస్తుందని, కార్మికులకు జీతాలు చెల్లించవలసి వస్తుందని ట్రావెల్స్ బోర్డు తిప్పేసి, కొన్ని వేల కోట్ల రూపాయలకు పంగనామం పెట్టిన కేశినేని ఇలాంటి నీతులు చెప్పడం సరికాదని ఎద్దేవా చేశారు.
ఎవరెవరికి ఏం చెయ్యాలో, ఏ పరిశ్రమలను ఎలా తీసుకురావాలో చంద్రబాబుకు బాగా తెలుసునని బుద్ధా వెంకన్న అన్నారు. మధ్యలో నాని ఉపన్యాసాలు వినేంత తీరిక, ఆయనతో చెప్పించుకునేంత ఖర్మ చంద్రబాబు లేదని చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కన చేరాడని ప్రజలు ఛీ కొట్టిన విషయాన్ని నాని మరచిపోయినట్టున్నాడని చురకలు అంటించారు. రాజకీయాలకు దూరమౌతున్నానని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఏం ఆశించి ఇలాంటి ట్వీట్లు పెడుతున్నావంటూ నిలదీశారు.












Click it and Unblock the Notifications