జగన్‌కు మోదీ అస్త్రం- చంద్రబాబుపై గురి
Peddireddy Mithun Reddy: కేంద్ర ఆర్థిక శాఖ మంత్ర నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో రాష్ట్రానికి ఆశించిన స్థాయిలో కేటాయింపులు లేకపోవడం రాజకీయ రచ్చకు దారి తీసింది. ఎన్డీఏ కూటమిలో అత్యంత కీలకమైన తెలుగుదేశం పార్టీ సారథ్యంలో సంకీర్ణ కూటమి అధికారంలో ఉన్నప్పటికీ ఏపీపై కేంద్రం చిన్నచూపు చూడటం దుమారానికి తెర తీసింది.
కేటాయింపుల్లో కేంద్రం ప్రదర్శించిన నిర్లక్ష్య వైఖరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అస్త్రాన్ని అందించినట్టయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా ఆత్మరక్షణలో పడేసింది.

బిహార్ సహా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీకి ఎలాంటి ప్రాజెక్టులు గానీ, పథకాలను గానీ కేటాయించకపోవడం వల్ల వైఎస్ఆర్సీపీ విమర్శనాస్త్రాలను సంధిస్తోంది కూడా. పార్లమెంటరీ పార్టీ అధినేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఇప్పటికే కూటమి సర్కార్‌పై నిప్పులు చెరిగారు.
ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్ర చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలం అయ్యారని విమర్శించారు. బడ్జెట్‌లో బిహార్‌కు బొనాంజాను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఏపీకి మొండిచెయ్యి చూపించిందని, ఇచ్చింది గుండుసున్నానేనని మిథున్ రెడ్డి ధ్వజమెత్తారు. దీనిపై చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ అంతర్మథనం చేసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం టీడీపీ మద్దతు మీద ఆధారపడినప్పటికీ ఏపీకి ప్రత్యేక కేటాయింపులు, ప్రత్యేక ప్రాజెక్టులు లేవని బుగ్గన ధ్వజమెత్తారు. రాజకీయ అనివార్య పరిస్థితులను రాష్ట్రానికి అనుకూలంగా మార్చుకోవడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమైందంటూ మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగంలో బిహార్ ప్రస్తావన పదే పదే వినిపించిన విషయాన్ని గుర్తు చేశారు. పాట్నాలో ఉన్న ఐఐటీ ఆధునీకరణ, సమర్థత పెంపు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఈఆర్‌ఎం ప్రాజెక్టు, మకానా బోర్డు, ఒక ఎయిర్ పోర్టు ఆధునీకరణ, మరొక కొత్త ఎయిర్ పోర్టు నిర్మాణం.. ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులకు కేంద్రం ప్రత్యేకంగా బిహార్‌కు ప్రకటించిందని గుర్తు చేశారు.
దేశవ్యాప్తంగా వచ్చే అయిదు సంవత్సరాల కాలంలో 75,000 మెడికల్ సీట్లు పెంచుతామంటూ నిర్మల సీతారామన్ ప్రకటించారని, ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి వీలుగా తమ ప్రభుత్వం వైద్య విద్యలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చిందని, కొత్తగా 17 మెడికల్ కాలేజీ నిర్మాణాలను చేపట్టిందని అన్నారు.
వైఎస్ జగన్ ముందుచూపుతో వల్ల రాష్ట్రానికి అదనంగా 2,550 మెడికల్ సీట్లు వస్తాయని, ఆ అవకాశాన్ని చంద్రబాబు చేతులారా పోగొట్టుకున్నారని బుగ్గన విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మెడికల్ కాలేజీలను నిర్వీర్యం చేసిందని, కేంద్రం మెడికల్ సీట్లు ఇస్తున్నా సరే..ఏపీకి వద్దంటూ లేఖలు రాసిందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications