చినబాబు రాకపోతాడా?: బాబుపై వైసిపి ఎమ్మెల్యే వ్యంగ్యాస్త్రాలు
హైదరాబాద్: బడ్జెట్ పైన చర్చలో భాగంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభలో గురువారం నాడు నవ్వులు పూయించారు. సీరియస్ అంశాలకు కూడా సామెతలు, పిట్టకథలు చెబుతూ సభలో అందర్నీ నవ్వించారు.
రైతు రుణాలు ఎప్పుడు మాఫీ అవుతాయంటే నందోరాజా భవిష్యతి, డ్వాక్రా రుణాలు ఎప్పుడు మాఫీ అవుతాయంటే నందో రాజా భవిష్యతి.. ఇలా ప్రతి అంశానికి అదే మంత్రం పఠించారు. ఆయన నందోరాజా భవిష్యతి కథ చెప్పి ప్రతి హామీపై ఎద్దేవా చేశారు.
ఆయన కథ చెబుతూ.. 'రాజు గారికి ఇద్దరు భార్యలు ఉన్నారు. చిన్న భార్య కొడుకు నందుడు. చిన్న భార్యకు ఊళ్లో అన్నిచోట్ల అఫ్పులే ఉన్నాయి. వాటిని ఎఫ్పుడు తీరుస్తారు అంటే ఏదో ఓ రోజు నందుడు రాజు కాకపోతాడా. అప్పులు తీర్చకపోతానా అని చెబుతూ వచ్చారు' అని కథ చెప్పాడు.

రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. నందుడిలాగే.. చినబాబు రాకపోతాడా రుణమాఫీ చేయకపోతామా, చినబాబు రాకపోతాడా డ్వాక్రా రుణాలు మాఫీ చేయకపోతామా అన్నట్లు అధికార టిడిపి పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు.
ఓ దోమ కథను కూడా చెప్పారు. పిల్ల దోమ పుట్టిన తర్వాత తొలిసారి ప్రపంచంలోకి వెళ్లి ఓ రోజంతా తిరిగి వచ్చిందని, వచ్చిన తర్వాత దాని తల్లి దోమ, తండ్రి దోమ కలిసి ప్రపంచం ఎలా ఉందని అడిగారని రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు.
దానికి పిల్ల దోమ.. నాకింత పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని మీరు ఇంత వరకు చెప్పనేలేదని, నేను బయటకు వెళ్లగానే అందరూ చప్పట్లు కొడుతున్నారని ( అసలు వారు చప్పట్లు కొట్టేది వెళ్లగొట్టేందుకు, లేదా చంపేందుకు) ప్రభుత్వం తీరు అలా ఉందని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications