అమరావతి తొలిదశ ప్రణాళిక ఇదే: 3 వాణిజ్య కేంద్రాలు, ప్రత్యేక హబ్‌లు
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం సమీపిస్తుండటంతో అమరావతి మహా నగరానికి ఓ తుది రూపు వచ్చింది. తొలి విడత రాజధాని నిర్మాణంలో భాగంగా రహదారి గ్రిడ్, నీటి కాల్వల నిర్మాణాలు మొదలవనున్నాయి.
వీటికి సంబంధించి కొది నెలలుగా ఏపీ ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వం మధ్య జరిగిన చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. కృష్ణా నదికి సమాంతరంగా ప్రతిపాదిత అమరావతి నగర పరిధిలో పాలవాగు, కొండవీటి వాగు ప్రవహిస్తున్నాయి. ఈ రెండు వాగులను అనుసంధానిస్తూ కాల్వల గ్రిడ్‌ను సింగపూర్ ప్రభుత్వం రూపొందించింది.
ఈ రోడ్లు, కాల్వల గ్రిడ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆమోదం తెలిపారు. సింగపూర్ ఇచ్చిన సీడ్ క్యాపిటల్ ప్రణాళిక, రాజధాని బృహత్ ప్రణాళికలోని రోడ్లపై భారత్ లోని ఆర్కిటెక్ట్‌లు, రోడ్లు భవనాల శాఖల అధికారులు, ప్రజల నుంచి వచ్చిన సూచనలను సీఆర్డీఏ అధ్యయనం చేసింది.

కృష్ణానదికి సమాంతరంగా పాలవాగు, కొండవీటి వాగులు ఉన్నాయి. ఈ నిర్మాణాల్లో భాగంగా వీటికి కలుపుతూ అడ్డంగా ఆరు కాలువలు వస్తాయి. రాజధాని చుట్టూ 450 చ.కిమీ పరిధిలో వర్షం నీరు రాజధాని మీదుగా కృష్ణానదిలోకి వెళ్లేలా ప్రణాళిక రూపొందించారు.
ఇక రాజధాని పరిధిలో వాణిజ్య కార్యకలాపాల కోసం మూడు ప్రాంతీయ వాణిజ్య కేంద్రాలతో పాటు రాజధానిలో తొమ్మిది 'థీమ్ సిటీలు' ఏర్పాటు చేయాలని ఇప్పటికే సర్కారు నిర్ణయం తీసుకుంది. బేతంపూడి వద్ద మొదటి కేంద్రం, వెంకటాపాలెం, కృష్ణయ్యపాలెం, ఉండవల్లి గ్రామాల మధ్యలో రెండోది, తుళ్లూరు వద్ద మూడో వాణిజ్య కేంద్రాన్ని నిర్మించనున్నారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో తొమ్మది రంగాలకు చెందిన ప్రత్యేక హబ్‌లను ప్రభుత్వం తీర్చిదిద్దనుంది. ఒక్కో హబ్ ఒక్కో రంగానికి ప్రత్యేక కేంద్రంగా ఉండనుంది. ఇందులో పర్యాటకం, ఆరోగ్యం, ఎలక్ట్రానిక్స్, విజ్ఞానం, విద్య, ప్రభుత్వ, న్యాయ, క్రీడల, దేవాలయ, ఆర్థిక కేంద్రాలుగా ఉన్నాయి.
1. పర్యాటక రంగం : ఉండవల్లి
2. ఆరోగ్యం రంగం: కృష్ణయ్యపాలేనికి సమీపంలో
3. ఎలక్ట్రానిక్స్ రంగం: బేతంపూడి
4ఏ. విజ్ఞానం రంగం: శాఖమూరు నుంచి రాజధాని సరిహద్దులో
4బీ. విద్య రంగం: ఐనవోలు నుంచి రాజధాని సరిహద్దులో
5. ప్రభుత్వ కోర్ రంగం: రాయపూడి
6. న్యాయం రంగం: నేలపాడుకు సమీపంలో
7. క్రీడలు రంగం: అబ్బరాజుపాలెం
8. దేవాదాయ రంగం: అనంతవరానికి కొద్దిదూరంలో
9. ఆర్థిక కేంద్రం రంగం: తల్లాయపాలెం, ఉద్దండరాయుని పాలెం వద్ద












Click it and Unblock the Notifications