కెసిఆర్ దొంగ, తాళాలు ఇవ్వబోతున్నారు: బైరెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై రాయలసీమ పరిరక్షణ పార్టీ నాయకుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను ఆయన వ్యతిరేకించారు. తెలంగాణతో కలిసే ప్రసక్తి లేదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో స్పష్టం చేశారు. రాయల తెలంగాణ పేరు మీద దొంగకు తాళాలు ఇవ్వబోతున్నారని, కెసిఆర్ దొంగ అని, కెసిఆర్‌కు తాళాలు ఇవ్వబోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
రాయలసీమకు చెందిన నాయకులు నారా చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి, వైయస్ జగన్ దుర్మార్గులని, వారికన్నా దొడ్డు ముక్కాయన కెసిఆర్ నాలుగు ఆకులు ఎక్కువ చదివారని ఆయన అన్నారు. కృష్ణా నదిపై తెలంగాణలో చేపట్టిన నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతలు, ఎస్ఎల్‌బిసి, ఆర్టిఎస్ లింక్ కెనాల్ సక్రమ ప్రాజెక్టులా అని ఆయన అడిగారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి 70 టిఎంసిల నీరు కేటాయించడం సక్రమమా అని ఆయన అడిగారు. వాటికి సమాధానాలు తెలంగాణ నాయకుల వద్ద లేవని ఆయన అన్నారు. కెసి కాలువ నీళ్లు ఆర్డిఎస్‌కు తరలించుకుని పోతున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టులు సక్రమమని నిరూపించాలని, ఆ తర్వాత రాయలసీమలో చేపట్టిన ప్రాజెక్టులు సక్రమమో అక్రమమో చెబుతామని ఆయన అన్నారు.

మీలాంటి నాయకులున్న తెలంగాణతో కలిసే ప్రసక్తే లేదని ఆయన తెలంగాణ నాయకులను ఉద్దేశించి అన్నారు. పదిమందికి అన్నం పెట్టేవాళ్లతో కలుస్తామని, ప్రతి విషయానికీ పేచీ పెట్టే మీలాంటివాళ్లతో కలవబోమని ఆయన అన్నారు. కెసిఆర్ లాంటి నాయకులపైనే తమ ఆగ్రహమని, తెలంగాణ ప్రజలపై కాదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు చాలా మంచివాళ్లని ఆయన కితాబు ఇచ్చారు.
తెలంగాణతో కలుస్తామని అంటున్న తమ ప్రాంత నాయకులకు సిగ్గు లేదని ఆయన అన్నారు. రాయలసీమలో నిర్మించిన ప్రాజెక్టులు అక్రమమని అంటున్న నాయకులతో ఎలా కలుస్తారని ఆయన అడిగారు. తెలంగాణలో కలిస్తే ఆర్టిఎస్, పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, గాలేరు నగరి, ఎస్ఆర్‌బిసి ప్రాజెక్టులకు నీరు రాదని ఆయన అన్నారు. ఆనకట్టనుంచైనా నీరు తీసుకుని పోవచ్చు గానీ తెలంగాణతో కలిస్తే చుక్క నీరు కూడా రాదని ఆయన అన్నారు.
తెలంగాణ నాయకులు దుర్మార్గులని, ఉన్నది తన్నుకుపోయే రకమైన ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. నాయకుల దొంగల మాటలు నమ్మవద్దని ఆయన రాయలసీమ ప్రజలను కోరారు. తెలంగాణతో కలిసే బదులు ఆత్మగౌరవంతో బతుకుదామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications