వైసీపీ ఓడిపోవటం కన్నా అదే ఎక్కువ బాధిస్తుంది: బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో వైసిపి ఘోర ఓటమిని చవిచూసింది. తెలుగుదేశం కూటమి 164 సీట్లతో ఘనవిజయాన్ని సాధించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. ఇలా వైసిపి ఇంత ఘోరంగా ఓటమి పాలు కావడం వెనుక కారణాలు ఏమిటి అన్నది వైసిపి నేతలు ప్రస్తుతం పోస్టుమార్టం చేస్తున్నారు.
వైసీపీ ఓటమిపై స్పందించిన బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి
ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసి అనేక కార్యక్రమాలు చేశామని ప్రజల మంచి కోసమే తాము కష్టపడ్డామని వైసిపి నేతలు పదేపదే చెబుతున్నారు. ప్రజలు తమను ఎందుకు ఆదరించలేదు అనేది అంతు చిక్కకుండా ఉందని ప్రతి ఒక్కరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వైసిపి ఓటమిపై శాప్ చైర్మన్, వైసిపి యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి స్పందించారు.

ప్రజల తీర్పును స్వాగతిస్తున్నాం
సార్వత్రిక ఎన్నికలలో ప్రజల ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వైసిపి ఓడిపోయింది అనే బాధ కన్నా.. ప్రజలు తమను ఎక్కడ చెడుగా అనుకుంటున్నారు అన్న బాధ ఎక్కువ ఉందని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు న్యాయం చెయ్యాలని తపన, అభివృద్ధి చేయాలని కాంక్ష తప్ప మరేదీ లేకుండా పని చేశామని ఆయన వెల్లడించారు.
ఇప్పుడు ఇంకా గట్టిగా కష్టపడతాం
అయినా ఎక్కడ తప్పు జరిగింది అనేది సమీక్షించుకుంటామని, అంతర్గతంగా చర్చించి కీలక నిర్ణయాలను తీసుకుంటామని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ప్రజల్లోకి బలంగా వెళతామని గడచిన 11 ఏళ్ల కంటే గట్టిగా కష్టపడతాం అని, ఈ ఐదేళ్ల కాలం కూడా జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడతామని అన్నారు. గత ఎన్నికల సమయంలో మా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు తాము ఎవరి మీద దాడులు చేయలేదన్నారు.
టీడీపీ దాడులను సహించేది లేదు
కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రాగానే మా పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి విమర్శించారు. వైసీపీ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. తన తుది శ్వాస విడిచే వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, వైయస్ జగన్ కోసమే పని చేస్తానని సిద్ధార్థ రెడ్డి పేర్కొన్నారు .గతం కంటే ఇప్పుడు ఎక్కువ కష్టపడతాం అని ఆయన వెల్లడించారు.












Click it and Unblock the Notifications