మోదీ కేబినెట్ లోకి మరో టీడీపీ ఎంపీ, ఆయనకే ఫిక్స్ - తెలంగాణ నుంచి ఆ ఇద్దరూ..!?
కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు రంగం సిద్దం అవుతోంది. సెప్టెంబర్ తొలి వారంలో కేబినెట్ లో కీలక మార్పులు జరగనున్నాయి. ఇప్పటికే ఈ మేరకు తుది కసరత్తు జరుగుతోంది. మోదీ4.0 తో పాటుగా త్వరలో జరిగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఈ మార్పులు చేస్తున్నారు. మిత్రపక్షా లకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇక ఏపీ, తెలంగాణ నుంచి మార్పులు జరగటం ఖాయంగా కనిపిస్తోంది. కొత్తగా అవకాశం దక్కే వారి పైనా దాదాపు స్పష్టత వస్తోంది.
ప్రధాని మోదీ తన కేబినెట్ ప్రక్షాళన కు సిద్దం అయ్యారు. అందులో భాగంగా ప్రస్తుతం ఉన్న కొందరు మంత్రులను గవర్నర్లుగా పంపాలని డిసైడ్ అయ్యారు. రాజ్యసభ పదవీ కాలం పూర్తయిన వారిని కేబినెట్ నుంచి తప్పించనున్నారు. మొత్తంగా 81 మంది వరకు కేబినెట్ మంత్రుల సంఖ్య ఉండనుంది. యువతకు, మహిళలకు మరియు వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం పెంచే దిశగా కసరత్తు జరుగుతోంది. పలువురు మంత్రులు బహుల శాఖలను నిర్వహిస్తున్నారు. వీరిని సర్దుబాటు చేయనున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వివిధ రాష్ట్రాల నుండి కొత్త నాయకులను కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉంది. కాగా, తెలుగు రాష్ట్రాల నుంచి కొత్తగా ఎవరికి అవకాశం దక్కుతుందనే చర్చ సాగుతోంది. ఏపీ నుంచి టీడీపీ, జనసేనలో ఒకరికి మంత్రి గా అవకాశం దక్కనుంది. టీడీపీ నుంచి ఇద్దరు కేంద్రంలో మంత్రులుగా ఉన్నారు.

తెలుగు రాష్ట్రాల నుంచి వీరికే ఛాన్స్
దీంతో, ఈ సారి విస్తరణలో జనసేనకు ఛాన్స్ దక్కుతుందని ప్రచారం సాగుతోంది. జనసేన ఎంపీ లు ముగ్గురు ఉన్నారు. పవన్ తుది నిర్ణయం కీలకం కానుంది. జనసేన ముందుకు రాకుంటే టీడీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఖాయమని తెలుస్తోంది. అదే విధంగా తెలంగాణ నుంచి ప్రస్తుతం కేంద్ర మంత్రులుగా ఉన్న ఇద్దరూ కొనసాగనున్నారు. తాజాగా బీజేపీ జాతీయ కమిటీలో తెలంగాణ కు ప్రాతినిధ్యం దక్కలేదు. కొత్తగా అదిలాబాద్ ఎంపీ నగేశ్, డీకే అరుణ, డాక్టర్ లక్ష్మణ్ పేర్లు రేసు లో ఉన్నాయి. అయితే.. ప్రస్తుతం కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి.. బండి సంజయ్ ను కొనసాగిస్తూనే... మరో ఇద్దరికి అవకాశం ఉందని చెబుతున్నారు. మహిళకు అవకాశం ఇవ్వాలని భావిస్తే డీకే అరుణకు ఖాయమని తెలుస్తోంది. అదే విధంగా ఈటల రాజేందర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దీంతో.. తెలుగు రాష్ట్రాల నుంచి కొత్తగా కేంద్ర మంత్రులు అయ్యేందుకు ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తికరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications