ఏపీలో మోదీ మార్క్ రాజకీయం - పురందేశ్వరికి షాక్, కానీ..!!
ప్రధానిగా మూడో సారి మోదీ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మోదీ ఈ సారి భాగస్వామ్య పక్షాల పై అధార పడ్డారు. టీడీపీ, జేడీ (యూ) కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆ పార్టీలకే ప్రాధాన్యత ఉంటుందనే వాదన ఇప్పటి వరకు వినిపించింది. కానీ, మోదీ తన మార్క్ రాజకీయం ఏంటో మరో సారి నిరూపించారు. ఏపీలోనూ తన మాటే నెగ్గేలా చేసుకున్నారు. బీజేపీ నుంచి పురందేశ్వరిని కాదని...అనూహ్యంగా శ్రీనివాస వర్మను మోదీ తన కేబినెట్ లోకి ఎంపిక చేసుకున్నారు.
పురందేశ్వరికి నో ఛాన్స్
కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ, జనసేన భాగస్వాములుగా ఉన్నారు. ఈ సాయంత్రం ప్రధాని తన మంత్రివర్గంతో సహా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి అయిదుగురికి ఛాన్స్ దక్కింది. ఏపీ నుంచి టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, పెమ్మసానికి అవకాశం దక్కింది. బీజేపీ నుంచి నుంచి అందరూ పురందేశ్వరికి ఛాన్స్ దక్కుతుందని అంచనా వేయగా, అనూహ్యంగా నర్సాపురం ఎంపీ శ్రీనివాస వర్మకు ప్రాధాన్యత ఇచ్చారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలి కంటే పార్టీలో సామాన్య కార్యకర్తకు అవకాశం ఇవ్వాలని మోదీ నిర్ణయించారు.

శ్రీనివాస వర్మ ఎంపిక వెనుక
దాదాపు 30 ఏళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్న శ్రీనివాస వర్మ పార్టీ టికెట్ ఎంత అనూహ్యంగా దక్కించుకున్నారో...ఇప్పుడు అంతకంటే పార్టీలో ఆశావాహులకు షాక్ ఇస్తూ కేంద్ర మంత్రి అవుతున్నారు. తెలంగాణ నుంచి పార్టీ రాష్ట్ర అధ్క్ష్యక్షుడు కిషన్ రెడ్డితో పాటుగా బండి సంజయ్ కు మంత్రి పదవి దక్కింది. తెలంగాణ, ఏపీలో ఒకేసారి కిషన్ రెడ్డి ..పురందేశ్వరిని అధ్యక్షులుగా నియమించారు. కానీ, కిషన్ రెడ్డికి కేంద్రంలో మంత్రి పదవి మరోసారి దక్కగా..పురందేశ్వరికి దక్కలేదు. ఏపీలో టీడీపీతో పొత్తు వేళ గత అనుభవాలను పరిగణలోకి తీసుకొని మోదీ తన మార్క్ రాజకీయం ఏపీలో అమలు చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. అదే సమయంలో జనసేనకు ఛాన్స్ దక్కలేదు.
మోదీ మార్క్ రాజకీయం
కేంద్ర మంత్రివర్గ విస్తరణలో జనసేనకు ఛాన్స్ ఇస్తారనే ప్రచారం సాగుతోంది. అదే విధంగా బీజేపీ నుంచి ఎంపీగా గెలిచిన సీఎం రమేష్ సైతం కేంద్రంలో మంత్రి పదవి పైన ఆశలు పెట్టుకున్నారు. కానీ, వీరి రాజకీయ నేపథ్యం కారణంగానే ప్రధాని ఆచి తూచి శ్రీనివాస వర్మ ను ఎంపిక చేసారనేది స్పష్టం అవుతోంది. విస్తరణ సమయం నాటికి రాజకీయంగా చోటు చేసుకొనే పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే, పురందేశ్వరి పేరు స్పీకర్ గా పరిశీలనలో ఉందని మద్దతు దారులు ప్రచారం ప్రారంభించారు. కేంద్రంలో ప్రతిపక్షం గతం కంటే ఈ సారి బలంగా ఉన్న పరిస్థితుల్లో పురందేశ్వరికి అవకాశం కష్టమనే వాదన ఉంది. దీంతో..మోదీ మిత్రపక్షాలతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నా..తన మార్క్ రాజకీయం మాత్రం కొనసాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications