కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసు: సత్యానందం దారిలోనే మిగతా ముగ్గురు?
విజయవాడ: కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసులో నాలుగో నిందితుడు సత్యానందానికి ముందస్తు బెయిల్ మంజూరు కావడంతో పరారీలో ఉన్న మిగతా ముగ్గురు నిందితులు కూడా అదే దారిలో పయనించే అవకాశం ఉంది. మిగతా ముగ్గురు నిందితులు కూడా ముందస్తు బెయిల్‌కు కోర్టులో దరఖాస్తులు పెట్టుకోవడానికి సిద్ధం కావచ్చునని అంటున్నారు. సత్యానందానికి హైకోర్టు మంగళవారంనాడు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
సత్యానందానికి ముందుస్తు బెయిల్ మంజూరు కావడం విజయవాడలో చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు యలమంచిలి రామ్మూర్తి అలియాస్ రాము, దూడల రాజేష్, భవానీశంకర్ అరెస్టయి జైలులో రిమాండు అనుభవిస్తున్నారు. సత్యానందంతోపాటు చెన్నుపాటి శ్రీను, పెండ్యాల శ్రీకాంత్, వెనిగళ్ళ శ్రీకాంత్ పరారీలో ఉన్నారు.

తాజాగా సత్యానందానికి హైకోర్టు మంగళవారం సాయంత్రం బెయిల్ మంజూరు చేసింది. దీంతో కేసులోని బాధితురాలు భయాందోళనకు గురైంది. వెంటనే నగర పోలీసు కమిషనర్‌కు ఫోన్ చేసి ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. పైగా సిపికి సైతం నిందితునికి బెయిల్ వచ్చిన సమాచారం తెలియలేదని అంటున్నారు. కేసులో అన్ని బలమైన సెక్షన్లు ఉన్నా మొదటి ప్రయత్నంలోనే ముందస్తు బెయిల్ రావడంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు.
సహజంగా స్థానిక సెషన్స్ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం, ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించడం నిందితులకు పరిపాటి. ఒకటికి రెండుమార్లు భంగపడిన తర్వాత బెయిల్ మంజూరు అవడం సహజం. కాని రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ కేసులో మొదటిసారే నిందితునికి ముందస్తు బెయిల్ మంజూరు కావడం బాధితులను అసంతృప్తికి గురి చేస్తోంది.
బెయిల్‌ను వ్యతిరేకించడంలో బలమైన వాదనలు వినిపించలేదన్న ఆరోపణలు ప్రాసిక్యూషన్‌పై వస్తున్నాయి. పరారీలో ఉన్న నిందితులను పట్టుకోకుండా బెయిల్ పొందేందుకు పరోక్షంగా అవకాశమిచ్చినట్లైందని భావిస్తున్నారు. కేసులో అత్యాచారం, చీటింగ్ తదితర అభియోగాలు నిందితునికి ఆపాదించబడవని, పైగా ప్రభుత్వ ఉద్యోగి అనే కారణంతో డిఫెన్స్ వాదనలు విన్న కోర్టు ఆయా గ్రౌండ్స్‌పై బెయిల్ మంజూరు చేసి ఉండవచ్చని న్యాయవాద వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
పైగా బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా పర్యవేక్షించేందుకు ఓ ఎస్‌ఐ కూడా హైకోర్టుకు వెళ్లి తిరిగి వచ్చేశారు. కనీసం బెయిల్ వచ్చిందని, ఇందుకు సంబంధించి హైకోర్టులో ఏం జరుగుతోందో కూడా ఇక్కడి పోలీసులకు సమాచారం లేదని చెబుతున్నారు. నాలుగో నిందితుడు సత్యానందంకు బెయిల్ రావడంతో మిగిలిన నిందితులు కూడా ధీమాగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications