తవ్వేకొద్ది కాల్‌మనీ అరాచకాలు: టీడీపీ ఎమ్మెల్యే బొండా సపోర్టుతో...!
విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్‌మనీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. అధికార పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు ఈ దందాలో ఉన్నట్లు గత కొన్ని రోజులుగా ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
అయితే తాజాగా ఓ కాల్‌మనీ సభ్యుడు ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సపోర్టుతో బాధితుడుని బెదిరించినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే, విజయవాడలోని దుర్గాపురానికి చెందిన డి.కిరణ్ అనే బాధితుడు రామకృష్ణాపురానికి చెందిన మానేపల్లి రణధీర్ వద్ద వ్యాపార అవసరం కోసం రూ. 2.95 లక్షలు అప్పుగా తీసుకున్నాడు.

తొలుత నెలవారీ వడ్డీ అని చెప్పి ఆ తర్వాత కొద్ది రోజులకే కాల్‌మనీ రూపంలో వడ్డీ చెల్లించాలని ఒత్తిడి చేయడంతో నెలకు రూ.90 వేల చొప్పున వడ్డీ కింద రూ. 5.60 లక్షలు చెల్లించాడు. అంతేకాదు అసలు కింద రూ. 3 లక్షలు చెల్లించాడు. అయినా అప్పు తీరలేదంటూ ముందు తీసుకున్న చెక్కులతో మన్నెం కనకవల్లి అనే మహిళ ద్వారా కోర్టులో కేసులు వేశాడు.
తనకు చెందిన పొలం కూడా అతని ఆధీనంలోనే ఉందని, పోలీసులకు ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తామన్నారు. తర్వాత సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పోలీసులపై ఒత్తిడి తేవడంతో వారు పట్టించుకోవడం లేదంటూ అతడు వాపోయాడు.
ఇలా కాల్‌మనీ బాధితులను ఎవరిని కదిలించినా వారి రోదన వర్ణనాతీతంగా ఉంది. మరికొంత మంది బాధితులు ఎమ్మెల్యే బొండా ఉమ పోలీసులపై ఒత్తిడి తెచ్చి కాల్‌మనీ వ్యాపారులకు అండగా ఉంటున్నాడంటూ ఆరోపిస్తున్నారు. ఐదు రోజుల కింద వెలుగులోకి వచ్చిన ఈ కాల్‌మనీ వ్యవహారంలో ఇప్పటికే యలమంచిలి రాము, దూడల రాజేష్‌ను అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications