కాకినాడలో కారు బీభత్సానికి ముగ్గురు బలి.. ఏడుగురికి సీరియస్ !!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కాకినాడ జిల్లాలోని కిర్లంపూడి మండలం సోమవారం గ్రామసమీపంలో జరిగిన ఈ ప్రమాదం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. పెళ్లి కార్యక్రమం ముగించుకుని తిరిగి వస్తున్న ఒక ఇన్నోవా కారు అదుపు తప్పి రోడ్డు పక్కన నిలబడి ఉన్న ప్రజలపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన సర్వత్రా ఆందోళన నింపుతోంది.
కారు టైర్ పేలడంతో బీభత్సం..
కాగా అన్నవరం వద్ద జరిగిన పెళ్లి కార్యక్రమం ముగించుకుని జగ్గంపేటకు తిరిగి వెళ్తుండగా.. ఇన్నోవా కారుకు ఫ్రంట్ టైర్ అకస్మాత్తుగా పేలిపోయింది. దాంతో కారు బస్సు షెల్టర్ దగ్గర బస్సు కోసం వేచి ఉన్న విద్యార్థులు, ప్రయాణికులపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను సోమవరానికి చెందిన కొండబాబు (30), ఆనందరావు (60), ఏలేశ్వరానికి చెందిన రాజు (60)గా పోలీసులు గుర్తించారు.

గాయపడిన ఏడుగురిలో విద్యార్థులు..
అయితే ఈ ప్రమాదంలో మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో విద్యార్థులు కూడా ఉన్నారు. స్థానికులు వెంటనే స్పందించి వారిని సమీపంలోని జగ్గంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. అవసరమైతే వారిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించనున్నట్లు సమాచారం.
ఇక ప్రమాద సమాచారం అందుకున్న కిర్లంపూడి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతుల కుటుంబాలను పరామర్శించి, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. బాధిత కుటుంబాలకు అన్ని రకాల సాయాన్ని అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
మరోవైపు సత్యసాయి జిల్లా తగరకుంటలో కూడా శనివారం ఉదయం ఒక పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. 60 మంది విద్యార్థులను తీసుకెళ్తున్న స్కూల్ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రాణనష్టం జరగలేదు. విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications