జగన్ పార్టీ అభ్యర్థిపై కేసు: కడప పోలింగ్‌పై ఫిర్యాదు
గుంటూరు/ న్యూఢిల్లీ : గుంటూరు జిల్లాలోని పొన్నూరు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి రావూరి వెంకటరమణపై ఆబ్కారీ అధికారులు కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం ఎడ్లపాడు మండలం మర్రిపాలెం గ్రామ పరిధిలోని జీకే టెక్స్‌టైల్స్‌లో 25వేల నకిలీ మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు.
వెంకటరమణ గోడౌన్‌లో మద్యం లభించడంతో ఎక్సైజ్ అధికారులు ఆయనపై కేసు నమోదు చేశారు. గోడౌన్‌లో పనిచేస్తున్న కొంతమంది సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ గోడౌన్‌ను తాను ఏడాది క్రితమే లీజ్‌కు ఇచ్చానని వెంకటరమణ చెప్పారు. కొందరు టిడిపి నేతలు కావాలనే తప్పుడు సమాచారం అందించి తనను కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని వెంకటరమణ ఆరోపించారు.

ఇదిలావుంటే, కడప జిల్లాలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ఏకపక్షంగా జరుగుతుందని ఆందోళన వ్యక్తంచేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి(సిఈసికి) తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు సిపిఎం రమేష్, లోక్‌సభ కడప పార్టీ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి సోమవారం ఉదయం ఫిర్యాదు చేశారు. పులివెందుల, లింగాల, జమ్మలమడుగులో ఒకే పార్టీకి 99శాతం పోలింగ్ నమోదవుతోందని ఫిర్యాదులో చెప్పారు. ఈ విషయం గతంలో జరిగిన పోలింగులో వెల్లడైందని వారు తమ ఫిర్యాదులో ఉటంకించారు.
తమ పార్టీల తరపున ఏజెంట్లుగా ఉండేందుకు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల భయం వల్ల ఎవరూ ముందుకు రావడం లేదని అందువల్ల పోలింగ్ ఏజెంట్లను ఇతర గ్రామాల నుంచి తీసుకువచ్చేందుకు అనుమతి ఇవ్వాలని సిఈసిని కోరారు. పోలింగ్ సరళిపై దృష్టి సారించాలని సిఈసికి విజ్ఞప్తి చేశారు. అనంతపురం ఎస్పీపై కూడా తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications