మహిళా ఎమ్మార్వోపై దాడి: టీడీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు, 'వీధి రౌడిలా'
విజయవాడ: పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇసకు మాఫియాను అడ్డుకునేందుకు వెళ్లిన ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై చింతమనేని, తన అనుచరులతో కలిసి బుధవారం దాడి చేసిన సంగతి తెలిసిందే.
ఎమ్మార్వో వనజాక్షితో పాటు ఆమె వెంట వచ్చిన రెవెన్యూ సిబ్బందిపైనా చింతమనేని అనుచరులు దాడి చేశారు. జరిగిన ఘటనపై ఎమ్మార్వో వనజాక్షి కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో చింతమనేనిపై పోలీసులు ఐపీసీ 353, 334, 379 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు తనపై దాడి చేసి, తనను ఈడ్చేసి, తన ఫోన్ కూడా లాక్కుని విసిరేశారని తహశీల్దార్ వనజాక్షి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మార్వో ఫిర్యాదుతోఎమ్మెల్యే సహా 50 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై టీడీపీ అధిష్ఠానం కూడా సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

చింతమనేనిపై గతంలో ఏలూరు పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ ఉంది. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్నందుకు ఎమ్మెల్యే, అతని అనుచరులు ఆమెపై భౌతిక దాడులకు దిగడం రాష్ట్రంలో దుమారం రేపుతోంది. ఇది ఇలా ఉంటే ఎమ్మార్వో వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు దాడి చేసిన ఘటనపై మంత్రి పీతల సుజాత స్పందించారు.
ఎమ్మార్వోపై జరిగిన దాడి సంఘటన తన దృష్టికి రాలేదని, విచారణ ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహిళా ఎమ్మార్వో వనజాక్షిపై దాడి ఘటనను నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు ఖండించారు. ఎమ్మార్వో వనజాక్షిపై దాడికి కారకులైన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని రెవెన్యూ సిబ్బంది డిమాండ్ చేశారు.
టీడీపీ ఎమ్మెల్యే వీధి రౌడిలా వ్వవహరించారు, అరెస్ట్ చేయాలి: పార్థసారథి
మహిళా ఎమ్మార్వోపై దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేయడంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పార్థసారథి మండిపడ్డారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
ఒక టీడీపీ ఎంపీ సైనికులను అవమానపరిచేలా మాట్లాడితే, మరో టీడీపీ ఎమ్మెల్యే ఏకంగా విధుల్లో ఉన్న ఓ ప్రభుత్వ ఉద్యోగిపైనే దాడి చేశారని అన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం ఇంత వరకు స్పందించకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
చింతమనేని ప్రభాకర్ ఎమ్మెల్యేగా కాకుండా వీధి రౌడిలా దౌర్జన్యానికి పాల్పడ్డారని పార్థసారథిని విమర్శించారు. ఇక మంత్రి దేవినేని ఉమ 'నీరు-చెట్టు' కార్యక్రమంలో అవినీతిని ప్రోత్సహిస్తున్నారని, అందుకే అధికారులపై ఈ విధంగా దాడులు జరుగుతున్నాయని ఆరోపణలు చేశారు.












Click it and Unblock the Notifications