చిక్కుల్లో చంద్రబాబు: వైఎస్ జగన్ చాన్స్ మిస్సయ్యారా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మీద పైచేయి సాధించే మంచి అవకాశాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేజేతులా జారవిడుచుకున్నారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. నోటుకు ఓటు కేసులో ఆత్మరక్షణలో పడిన చంద్రబాబును ఎదుర్కుని, పైచేయి సాధించడానికి సరైన వ్యూహాన్ని జగన్ అనుసరించలేదనే వ్యాఖ్యలు రాజకీయ నిపుణుల నుంచి వస్తున్నాయి.
నోటుకు ఓటు కేసులో రేవంత్ రెడ్డి తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులకు పట్టుబడి, స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు ఫోన్‌లో నేరుగా మాట్లాడినట్లు ఆడియో టేపులు విడుదలైన తర్వాత జగన్ తగిన వ్యూహాన్ని రచించుకుని అమలు పరిచి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలాన్ని పుంజుకుని ఉండేవారని అంటున్నారు.
వరుసగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించి, ప్రజల వద్ద చంద్రబాబు అవినీతి ఆరోపణలు చేస్తూ చొచ్చుకుపోవడానికి బదులు జగన్ ఢిల్లీకి వెళ్లి వ్యవహారం నడిపారని అంటున్నారు. చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేస్తూ అనవసరమైన కాలాన్ని వృధా చేశారనే అంచనాలు సాగుతున్నాయి. దానికితోడు, దాని వల్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రాయబారిగా తాను వ్యవహరించినట్లు తెలుగుదేశం పార్టీ నుంచి విమర్శలను కూడా జగన్ ఎదుర్కోవాల్సి వచ్చింది.

కెసిఆర్‌తో జగన్ కుమ్మక్కయ్యారని తెలుగుదేశం పార్టీ పదే పదే వ్యాఖ్యలు చేస్తూ పోయింది. దీంతో ప్రజల్లో అది నిజమేనని అనిపించే స్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో జగన్ తమ రాష్ట్ర ప్రయోజనాలను ఆ రకంగా దెబ్బ తీస్తున్నారనే అభిప్రాయం కలగడానికి అవకాశం ఏర్పడిందని అంటున్నారు.
బహుశా ఆ విషయాన్ని గమనించే కావచ్చు, జగన్ నోటుకు ఓటు కేసు వ్యవహారంలో కాస్తా వెనక్కి తగ్గినట్లు కనిపిస్తున్నారు. ఈ స్థితిలో ఆయన పార్టీ ముఖ్యులతో సమావేశం పెట్టి పరిణామాలపై చర్చించారు. నోటుకు ఓటు వ్యవహారంలో పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ వైయస్ జగన్ ఆ సమావేశం తర్వాత కాస్తా వెనక్కి తగ్గినట్లు కనిపిస్తున్నారు.
పైగా, జగన్ కాస్తా మౌనం దాల్చిన స్థితిలో చంద్రబాబు నాయుడు రాష్ట్ర పర్యటనకు పూనుకున్నారు. ఆయన గురువారంనాడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. రాత్రి విజయవాడలో బస చేసి, రేపు శుక్రవారం చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆ రకంగా ఆయన ప్రజల్తో తన పట్ల విశ్వాసాన్ని పెంపొందించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications