జగన్ ఢిల్లీ రావాలి.. కుల గణన పోరులో కీలక పరిణామం..
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అఖిల భారత కుల గణన సమన్వయ కమిటీ ప్రతినిధులు కలిశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్‌తో భేటీ అయిన కమిటీ సభ్యులు.. ఈ నెల 28వ తేదీన దేశ రాజధాని న్యూఢిల్లీలో తాము చేపట్టబోతున్న "చలో రాంలీలా మైదాన్" జాతీయ స్థాయి నిరసన ప్రదర్శనకు ఆయనను సాదరంగా ఆహ్వానించారు.
దేశంలో సమగ్రమైన కుల గణన చేపట్టాలని, తద్వారా బీసీ, ఓబీసీ వర్గాల రిజర్వేషన్ల హక్కులను కాపాడాలని తాము చేస్తున్న పోరాటానికి వైఎస్సార్సీపీ మద్దతు ఇవ్వాలని, అలాగే ఈ మహాధర్నాలో స్వయంగా పాల్గొనాలని జగన్‌ను కోరారు. ఈ ప్రతిపాదనపై వైఎస్ జగన్ సానుకూలంగా స్పందిస్తూ, తమ సంఘీభావాన్ని తెలియజేశారు.

బహుజన హక్కుల కోసం దేశవ్యాప్త సమీకరణ..
ఈ కీలక ప్రతినిధి బృందంలో దేశవ్యాప్తంగా వివిధ సామాజిక వర్గాల తరఫున పోరాడుతున్న ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. మండల్ కమిషన్ మాజీ ఛైర్మన్ బీపీ మండల్ మనవడు, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరజ్ మండల్, అఖిల భారత ఓబీసీ విద్యార్థుల సంఘం జాతీయ అధ్యక్షుడు గౌడ్ కిరణ్ కుమార్, సకల్ ఓబీసీ మహామొర్చా అధ్యక్షుడు ఉమేష్ కుర్రం, పిట్టి మల్లికార్జున్ యాదవ్‌లతో పాటు రాకేశ్ దత్తా, పెందెం జయంతి యాదవ్, రజనీకాంత్ గౌడ్ వంటి పలువురు కీలక నేతలు జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఓబీసీ కాలమ్ లేకపోతే ఎంత నష్టం?..
భేటీ అనంతరం ప్రొఫెసర్ సూరజ్ మండల్ మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ జనాభా గణనలో ఓబీసీల కోసం ప్రత్యేకమైన కాలమ్‌తో పాటు, ప్రతి కులాన్ని గుర్తించేలా డ్రాప్-డౌన్ మెనూను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జనాభాకు తగినట్లుగా రిజర్వేషన్ల ప్రయోజనాలు అందాలన్నా, కచ్చితమైన లెక్కలు తేలాలన్నా ఇది ఎంతో అవసరమన్నారు. తగిన బీసీ జనాభా డేటా లేకపోవడం వల్లే ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు పెంచేందుకు హైకోర్టు అనుమతించలేకపోయిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అందువల్ల ఖచ్చితమైన సమాచారం సేకరించడం అత్యంత ప్రాముఖ్యమైన విషయమని స్పష్టం చేశారు.
ఏన్డీఏయేతర పార్టీల మద్దతు కూడగడుతున్నాం..
కాశ్మీర్ నుంచి కేరళ వరకు దేశవ్యాప్తంగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వంటి వివిధ రాష్ట్రాలకు చెందిన 60కి పైగా ఓబీసీ సంఘాలను ఈ కమిటీ ఏకం చేస్తోందని గౌడ్ కిరణ్ కుమార్ వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీల తరహాలోనే దేశంలోని ఓబీసీ సామాజిక వర్గాలన్నింటికీ సమగ్ర కుల గణన నిర్వహించి, వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులను రికార్డు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా ఉన్న ఎన్డీయేయేతర రాజకీయ పార్టీల మద్దతును కూడగడుతున్నామని చెప్పారు. కోర్టుల్లో బీసీ రిజర్వేషన్లను కాపాడుకోవడానికి, ప్రస్తుతం ఉన్న 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని సవాలు చేయాలన్నా సరైన కుల గణన డేటా ఎంతో కీలకమని ఆయన అన్నారు.
పంచాయతీ పోరుకు క్యాడర్‌ను సమాయత్తం చేస్తున్న జగన్..
మరోవైపు, వైఎస్సార్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి శనివారం నాడు పార్టీ పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల పరిశీలకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. త్వరలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతి సర్పంచ్, వార్డు స్థానంలో వైఎస్సార్సీపీ మద్దతుదారులు పోటీ చేసేలా పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని వైఎస్ జగన్ ఆదేశించినట్లు వెల్లడించారు.
ఫలితాలు ఎలా ఉన్నా, గ్రామాల్లో గట్టి పోటీ ఇచ్చేలా క్యాడర్‌ను సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. పంచాయతీ ఎన్నికలకు పార్టీ గుర్తులతో సంబంధం లేకపోయినప్పటికీ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి, భవిష్యత్ ఎన్నికలకు శ్రేణులను సిద్ధం చేయడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. గత మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు అధికారులు, పోలీసులను అడ్డుపెట్టుకుని నామినేషన్ల నుంచి కౌంటింగ్ వరకు బెదిరింపులకు పాల్పడ్డారని, అలాంటి వాటిని తట్టుకుని నిలబడేలా పోరాడాలని ఆయన కార్యకర్తలకు ధైర్యం చెప్పారు.












Click it and Unblock the Notifications
