YS Viveka case: వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ - హైదరాబాద్ తరలించిన సీబీఐ..!!
వైఎస్ వివేకా హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎంపీ అవినాష్ తండ్రి భాస్కర రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది.. ఈ ఉదయం పులివెందులలో ఆయన నివాసానికి వెళ్లిన సీబీఐ అధికారులు కేసుకు సంబంధించి వివరాలు సేకరించారు.
ఆ తరువాత అదుపులోకి తీసుకున్నట్లుగా ప్రకటించిన సీబీఐ అధికారులు..తమ వాహనాల్లో హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో సీబీఐ ఇప్పటికే భాస్కర రెడ్డిపైన అనేక అభియోగాలు నమోదు చేసింది. రెండు సార్లు విచారణకు పిలిచింది. ఇప్పుడు అరెస్ట్ చేసింది.

భాస్కరరెడ్డి పాత్రపై సీబీఐ అభియోగాలు: వివేకా హత్య కేసులో ఆధారాలు టాంపరింగ్ తో పాటుగా కుట్రలో భాస్కర రెడ్డి పాత్ర ఉందని సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. తాజాగా ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్టులోనూ కీలక అంశాలను ప్రస్తావించింది. ఉదయ్ కుమార్ రెడ్డి, ఎంపీ అవినాశ్ రెడ్డి, అతని తండ్రి భాస్కర్ రెడ్డి,శివశంకర్ రెడ్డిలు కలిసి ఆధారాలను తారుమారు చేశారని సీబీఐ రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది.
వివేకా చనిపోయారని నిర్ధారణ చేసుకునేవరకు అందరు ఇంట్లోనే ఉన్నారని పేర్కొంది. కానీ విచారణలో ఉదయ్ కుమార్ రెడ్డి ఎటువంటి విషయాలను వెల్లడించటంలేదన్నారు. ఆధారాలను తారు మారు చేయటంలో భాస్కర రెడ్డి పాత్రను సీబీఐ ప్రస్తావించింది.
హైకోర్టులో భాస్కర రెడ్డి పిటీషన్: భాస్కర రెడ్డి విచారణకు సీబీఐ రెండు సార్లు పిలిచింది. అటు ఎంపీ అవినాశ్ రెడ్డి ఇదే కేసులో సీబీఐ ముందు నాలుగు సార్లు విచారణకు హాజరయ్యారు. అటు ...ఇదే కేసులో భాస్కర రెడ్డి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ఆ సమయంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. దస్తగిరిని అప్రూవర్ గా అనుమతించవద్దని భాస్కర్ రెడ్డి కోర్టును కోరారు.
వాదనల సందర్భంగా వివేకా హత్య కేసులో కొత్త కోణం వెల్లడైంది. సునీల్ యాదవ్ తల్లిని వివేకా లైంగికంగా వేధించారని, తల్లిని లైంగికంగా వేధించడం వల్లే వివేకాను సునీల్ యాదవ్ హత్య చేశారని భాస్కర్ రెడ్డి తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. వాదనలు విన్న పిమ్మట తదుపరి విచారణను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది.
అరెస్ట్ - తరలింపు: ఈ ఉదయం పులివెందులలో భాస్కర రెడ్డి ఇంటికి పెద్ద సంఖ్యలో సీబీఐ అధికారులు వెళ్లారు. కుటంబ సభ్యులు మినహా మిగిలిన వారిని అనుమతించ లేదు. ఆ తరువాత భాస్కర రెడ్డిని అదుపులోకి తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రత్యేక వాహనంలో అధికారులు భాస్కర రెడ్డిని హైదరాబాద్ తరలించారు.
తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని భాస్కర రెడ్డి అధికారులతో చెప్పినట్లు సమాచారం. భాస్కర రెడ్డితో పాటుగా ఆయన పీఏను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. భాస్కర రెడ్డి అరెస్ట్ కు సంబంధించి సీబీఐ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.












Click it and Unblock the Notifications