ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు: ఈ మధ్యాహ్నమే..!!
కడప: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు దర్యాప్తు ముమ్మరం అయింది. ఈ కేసును విచారిస్తోన్న కేంద్ర దర్యాప్తు సంస్థ.. సీబీఐ అధికారులు ఇప్పటికే కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయనను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు.
ఇప్పుడు తాజాగా మరో కీలక మలుపు తీసుకుంది. సీబీఐ అధికారులు వైఎస్ అవినాష్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో అవినాష్ రెడ్డి ఇప్పటికే విచారణను ఎదుర్కొన్నారు. మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని తమ కార్యాలయానికి రావాలని సూచించారు. ఈ విషయాన్ని ఆయనకు జారీ చేసిన నోటీసుల్లో పొందుపరిచారు.

వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్టయిన మరుసటి రోజే సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని కూడా విచారణకు పిలిపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదివరకు రెండు, మూడుదఫాలుగా ఆయన విచారణకు హాజరయ్యారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చారు. ఈ హత్యకేసులో దర్యాప్తు ముమ్మరం కావడం, వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన రోజు రాత్రే అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చోటు చేసుకున్న హైప్రొఫైల్ మర్డర్ కేసు ఇది. 2019 మార్చి 15వ తేదీన పులివెందులలోని తన నివాసంలో వైఎస్ వివేకానంద రెడ్డి దారుణహత్యకు గురయ్యారు. సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్రంలో సంచలనాన్ని సృష్టించింది.
కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన మాజీ మంత్రి దేవగుడి ఆదినారాయణ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. దాన్ని ఆయన తోసిపుచ్చారు. ఈ హత్యోదంతాన్ని విచారించడానికి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
ఆ తరువాత కూడా వైఎస్ వివేకా హత్యకేసు ఆశించినంత వేగంగా ముందుకు సాగకపోవడంతో- ఆయన కుమార్తె డాక్టర్ సునీత రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును సీబీఐకి బదలాయించాలంటూ విజ్ఞప్తి చేస్తూ పిటీషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు- ఈ కేసును సీబీఐకి అప్పగించింది. అప్పట్లో కొందరు అనుమానితుల పేర్లను సునీత తన పిటీషన్‌లో పొందుపరిచారు.
వైఎస్ వివేకా ఇంటి వాచ్‌మన్ రంగయ్య, సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డి, కడప లోక్ సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, మాజీ మంత్రి ఆది నారాయణరెడ్డి, మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిల పేర్లను చేర్చారు. ఈ జాబితాలో ఉన్న వారిలో వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు.












Click it and Unblock the Notifications