RK Roja: డ్రామా ఆర్టిస్ట్‌గా మారిపోయిన పవన్ కళ్యాణ్
తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందంటూ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ పవన్ కళ్యాణ్ చేసిన ప్రచారం పూర్తిగా తప్పుడు దుష్ప్రచారమని, సుప్రీంకోర్టు ఆదేశాలతో జరిగిన సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చార్జిషీట్ ద్వారా స్పష్టమైందని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. వైయస్ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక, ఆయన ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రచారం చేశారని ఆమె మండిపడ్డారు. కోట్లాది మంది హిందువులు ఆరాధించే తిరుమల శ్రీనివాసుడి పవిత్రతను కూడా రాజకీయ లబ్ధి కోసం కించపరిచారని విమర్శించారు.
నగరిలో మీడియాతో మాట్లాడిన ఆర్కే రోజా మాట్లాడుతూ, నిజాయితీగా విచారణకు ఎదురొడ్డి నిలబడి, తిరుమల లడ్డూ తయారీలో జంతు కొవ్వు ఉపయోగించలేదని చట్టపరంగా నిరూపించుకున్న వైయస్ జగన్‌పై చేసిన ఆరోపణలకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందేనన్నారు. వైయస్ జగన్ కాళ్లు కడిగి ఆ నీళ్లను తమ తలపై చల్లుకోవడమే వారి చేసిన తప్పులకు సరైన పరిహారమని వ్యాఖ్యానించారు.

సీబీఐ చార్జిషీట్ వచ్చినా మారని వైఖరి
సీబీఐ సిట్ చార్జిషీట్ స్పష్టంగా నిజాలను వెల్లడించినప్పటికీ, టీడీపీ జనసేన నేతలు ఇంకా అదే అబద్ధపు ప్రచారాన్ని కొనసాగించడం దుర్మార్గమని ఆర్కే రోజా అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాకుండా, భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. దేవుడంటే భయం, భక్తి ఉంటే ఇలాంటి దుష్ప్రచారాలకు దిగేవారా అని ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ ఏం ప్రాయశ్చిత్తం చేస్తారు?
చంద్రబాబు చెప్పినట్టు మాట్లాడే డ్రామా ఆర్టిస్ట్‌గా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారని ఆర్కే రోజా విమర్శించారు. లడ్డూలో కల్తీ జరిగిందంటూ అబద్ధాలు ప్రచారం చేసినప్పుడు విజయవాడ దుర్గమ్మ ఆలయంలో మెట్లు కడిగిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఆ ప్రచారం అసత్యమని తేలిన తర్వాత భక్తులకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను కించపరిచినందుకు ముందుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తిరుమల ప్రతిష్టను దెబ్బతీశారు
వారాహి డిక్లరేషన్ పేరుతో తిరుపతిలో నిర్వహించిన సభలో తిరుమల లడ్డూపై చేసిన వ్యాఖ్యలు శ్రీవారి ప్రతిష్టను మంటగలిపినట్టేనని ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసం దేవుడినే వదలకుండా వాడుకున్నారని ఆరోపించారు. నిజంగా హిందూ ధర్మాన్ని గౌరవించే వారైతే సీఎం చంద్రబాబు చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తక్షణమే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
డైవర్షన్ రాజకీయాల కోసం దేవుడినే వాడుకున్నారా?
విజయవాడ వరదల సమయంలో సహాయక చర్యల్లో విఫలమైన కూటమి ప్రభుత్వం, ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే తిరుమల లడ్డూలో పంది కొవ్వు కలిసిందంటూ దుష్ప్రచారం చేసిందని ఆర్కే రోజా ఆరోపించారు. ప్రజల కష్టాల నుంచి తప్పించుకునేందుకు దేవుడి ప్రతిష్టతో చెలగాటమాడటం ఘోరమని విమర్శించారు.
ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు
తప్పుడు ప్రచారం, అబద్ధపు రాజకీయాలతో ప్రజలను మోసం చేస్తున్న టీడీపీ, జనసేన పార్టీలను ప్రజలు తగిన విధంగా శిక్షిస్తారని ఆర్కే రోజా అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు రాజకీయాలకు త్వరలోనే ప్రజా తీర్పు తప్పదని ఆమె స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications