ఢిల్లీకి మాజీ సీఎం జగన్ - బిగ్ టర్న్..!?
ఏపీ కేంద్రంగా కొత్త రాజకీయం మొదలైంది. ఎన్నికల్లో గెలిచిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ నెల 12న కొలువు తీరనుంది. వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితం అయింది. అటు కేంద్రంలో..ఇటు ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావటంతో వైసీపీ భవిష్యత్ పై చర్చ మొదలైంది. జగన్ తో పార్టీ నేతలు సమావేశం అవుతున్నారు. జగన్ వారికి భవిష్యత్ పై భరోసా ఇస్తున్నారు. ఇదే సమయంలో అనూహ్యంగా జగన్ ఢిల్లీ యాత్ర పై పార్టీలో ఆసక్తికర చర్చ మొదలైంది.
జగన్ కార్యాచరణ
తిరిగి అధికారంలోకి వస్తాయని జగన్ ఫలితాల వరకు ధీమాగా కనిపించారు. కానీ, ఫలితాల్లో మాత్రం నిరాశ తప్పలేదు. వైసీపీ ఓటమి కంటే పార్టీకి దక్కిన సీట్లు నేతలు, కేడర్ జీర్ణించుకోలేక పోతున్నారు. జగన్ తమకు ప్రతిపక్షంలో ఉండటం కొత్త కాదని..ప్రజల తరపున నిలబడతామని చెప్పుకొచ్చారు. అధికారంలో ఉన్న సమయంలో జగన్ సలహాదారులు..సీఎంఓ అధికారుల తీరు పైన ఇప్పుడు ఓటమి తరువాత వైసీపీ నేతలు మండి పడుతున్నారు. ఐప్యాక్, వాలంటీర్ల వ్యవస్థ తమ గెలుపు అవకాశాలను దెబ్బ తీసిందని ఆక్రోశిస్తున్నారు.

భవిష్యత్ ఏంటి
అటు కేంద్రంలో మోదీ ప్రభుత్వం కొలువు తీరింది. ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్దమయ్యారు. వైసీపీ నేతలు జగన్ ను కలుస్తున్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అయినా నెంబర్ గేమ్ కొనసాగుతోంది. ప్రస్తుతానికి ఎన్డీఏకు మద్దతు విషయంలో ఎలాంటి సమస్య లేదు. కానీ..బీజేపీ ముఖ్య నేతలు భవిష్యత్ లోనూ ఇబ్బందులు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. అటు ఇండియా కూటమి సైతం అప్రమత్తంగా కనిపిస్తోంది. ప్రతీ పార్టీ..ప్రతీ ఎంపీ కీలకంగా మారుతున్నారు. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామి కావటం..రాష్ట్రంలో అధికారంలోకి రావటంతో వైసీపీ భవిష్యత్ ఏంటనే చర్చ మొదలైంది. కొందరు నేతలు వైసీపీ వీడేందుకు సిద్దమయ్యారు.

ఢిల్లీకి పర్యటనతో
ఈ సమయంలో జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నట్లు పార్టీ సమాచారం. జగన్ ఢిల్లీలో ఎవరిని కలుస్తారు..ఏం చేయబోతున్నారనేది మాత్రం సస్పెన్స్ గా మారుతోంది. జగన్ కాంగ్రెస్ కూటమితో కలిసేందుకు ససేరమిరా అంటున్నారు. బీజేపీతో టీడీపీ కలిసి ఉన్న ఈ సందర్భంలో కేంద్రంలోని ముఖ్యులతో తిరిగి సత్సంబంధాలు సాధ్యం కావనే వాదన ఉంది. తాజాగా మూడో సారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీకి జగన్ అభినందనలు తెలిపారు. 2019-24 వరకు జగన్ -మోదీ మధ్య సత్సంబంధాలు కొనసాగాయి. ఢిల్లీ కేంద్రంగా జరుగుతన్న రాజకీయ చర్చల వేళ జగన్ ఢిల్లీ వెళ్లనున్నారనే సమాచారం పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తిని పెంచుతోంది.












Click it and Unblock the Notifications