కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్- డీఏ పెంపుకు కేబినెట్ ఆమోదం..!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధాని నరేంద్ర మోడీ గుడ్ న్యూస్ చెప్పారు. ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న డీఏ పెంపుకు ఇవాళ సమావేశమైన కేంద్ర కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపారు. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు శాతం డిఏ పెంచుతూ కేబినెట్ ఇవాళ నిర్ణయం తీసుకుంది. దీంతో డీఏ మొత్తం 55 శాతానికి చేరినట్లయింది. కేంద్ర కేబినెట్ నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర కేబినెట్ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు ప్రయోజనం కలగబోతోంది. గతేడాది జూలైలో చివరి సారిగా కేంద్రం డీఏ పెంపు ప్రకటించింది. ఆ తర్వాత ఇప్పుడే డీఏను రెండు శాతం పెంచింది. దీంతో లక్షల సంఖ్యలో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. పెరిగిన ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని ఉద్యోగుల డీఏను పెంచినట్లు కేంద్ర కేబినెట్ భేటీ అనంతరం మంత్రులు తెలిపారు.

వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కరవు భత్యం (డీఏ)పెంపును అఖిల భారత వినియోగదారుల ధరల సూచీ డేటా ఆధారంగా నిర్ణయిస్తారు. ఏదైనా సవరణపై నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం గత ఆరు నెలల గణాంకాలను అంచనా వేస్తుంది. అయితే డీఏ పెంపుపై తుది నిర్ణయం మాత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగే కేబినెట్ సమావేశంలోనే నిర్దారిస్తారు. వేతన సవరణ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ప్రస్తుతానికి డీఏ రూపంలో ఊరట దక్కినట్లయింది.












Click it and Unblock the Notifications