జగన్ పాలనలో కొత్త రికార్డు, లెక్కలు వెల్లడించిన కేంద్రం - టీడీపీకి షాక్..!!
పార్లమెంట్ సాక్షిగా కేంద్రం జగన్ సాధించిన విజయాన్ని వెల్లడించింది. టీడీపీ పాలనలో కంటే రికార్డు స్థాయిలో ఏపీలో పెట్టుబడులు వచ్చాయని రాజ్యసభ సాక్షిగా వెల్లడించింది. టీడీపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో 2019 నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎక్కడా తగ్గలేదని, ఇంకా చెప్పాలంటే క్రమేణా పెరిగాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఏపీలో రికార్డు స్థాయిలో : ఏపీలో పెట్టుబడుల అంశం పైన కేంద్రం లిఖిత పూర్వకంగా స్పష్టత ఇచ్చింది. ఏపీలో పెట్టుబడులు తగ్గలేదని తేల్చింది. ఇంకా చెప్పాలంటే 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆల్ టైమ్ రికార్డు స్థాయి పెట్టుబడులు వచ్చాయని వెల్లడించింది. ఈ ఒక్క ఏడాదిలోనే అత్యధికంగా 284.22 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్టు కేంద్రం రాజ్యసభలో ఇచ్చిన ఓ సమాధానంలో పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్‌లో 2019 తర్వాత విదేశీ పెట్టుబడులు దారుణంగా పడిపోయాయా? ఆ కారణంగా రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి, ఉపాధి కల్పన తగ్గిందా? అంటూ తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ శుక్రవారం సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాశ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అందులో గణాంకాలతో సహా పెట్టుబడుల వివరాలను పొందుపరిచారు.
టీడీపీ ఎంపీకి సమాధానంగా : కోవిడ్-19 పరిస్థితుల కారణంగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో మాత్రమే పెట్టుబడులు తగ్గాయి మినహా ప్రతియేటా క్రమంగా పెరిగాయని మంత్రి స్పష్టం చేసారు. 2019 అక్టోబర్ - 2020 మార్చ్ మధ్య : 200.97 మిలియన్ డాలర్లు విదేశీ పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. 2020- 21 : 85.85 మిలియన్ డాలర్లు , 2021-22 : 224.96 మిలియన్ డాలర్లు , 2022-23 : 284.22 మిలియన్ డాలర్లు వచ్చినట్లు కేంద్రం గణాంకాల ను స్పష్టం చేసింది.
ఆయా రాష్ట్రాల్లోని సహజ వనరులు, మార్కెట్ సైజ్, మౌలిక వసతులు, రాజకీయంగా పెట్టుబడులకు అనుకూల వాతావరణం, సూక్ష్మ ఆర్థిక స్థిరత్వం, పెట్టుబడులపై విదేశీ పారిశ్రామికవేత్తల ధోరణి వంటి అంశాలపై విదేశీ పెట్టుబడులు ఆధారపడి ఉంటాయని కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నెంబర్ 1 : కోవిడ్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజా జీవనం స్థంభించిపోగా ఆ ప్రభావం వలన 2020-21 మధ్య మాత్రం పెట్టుబడుల్లో క్షీణత ఉంది. ఆ కొద్దికాలం దాటగానే ఆంధ్రాలో మళ్ళీ పెట్టుబడుల వరద మొదలైంది. వైసీపీని ఇరకాటంలో పెట్టాలనే ఉద్దేశంతో టీడీపీ ఎంపీ ప్రయత్నం చేసారని..కేంద్రం ఇచ్చిన సమాధానంతో షాక్ తిన్నారని వైసీపీ ఎంపీలు చెబుతున్నారు.
విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ లో ఏపీకి రూ 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చిన విషయాన్ని ఎంపీలు గుర్తు చేస్తున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ లో దేశంలోనే ఏపీ నంబర్ -1 లో నిలిచిందని చెప్పుకొచ్చారు. పార్లమెంట్ సాక్షిగా ఏపీకి పెట్టుబడులు రాలేదనే విమర్శలకు కేంద్రం సమాధానం ఇచ్చింది.












Click it and Unblock the Notifications