పాత కేసులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! ప్రభుత్వంపై కుట్రలు..
రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు కుట్రలు పన్నుతూ, ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వివిధ సంఘటనలకు కులం, మతం అనే రంగులు పులుముతూ వివాదాస్పదంగా మారుస్తున్నారని, ఫేక్ ప్రచారాలతో ఉద్యోగులను, అధికారులను బద్నాం చేస్తూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
సోమవారం రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ (RTGS) కేంద్రం నుంచి వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి విద్వేషాలు పెంచే ఘటనలు, తప్పుడు ప్రచారాలను కంట్రోల్ చేసేలా ఉద్యోగులు, అధికారులు మరింత అప్రమత్తతతో వ్యవహరించాలని ఆయన ఆదేశించారు.
మానవీయ కోణంలో అర్జీల పరిష్కారం.. అధికారులకు దిశానిర్దేశం
రాష్ట్రంలో పీజీఆర్ఎస్ సహా ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీని అధికారులు మానవీయ కోణంలో ఆలోచించి పరిష్కరించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారం కోసం వచ్చే పౌరులతో అధికారులు ఎంతో సౌమ్యంగా, మర్యాదగా వ్యవహరించాలని, ప్రతి ఒక్కరూ సాఫ్ట్ స్కిల్స్ అలవరచుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఫిర్యాదుదారుల స్థానంలో ఉండి సమస్యను చూస్తేనే దానికి సరైన పరిష్కారం లభిస్తుందని, దీని ద్వారా పాలనపై ప్రజల్లో మంచి భావన కలుగుతుందని సీఎం పేర్కొన్నారు.

క్షేత్రస్థాయి పర్యటనలకే ప్రాధాన్యం..
మారుతున్న కాలానికి అనుగుణంగా మంత్రులు, అధికారులు, ఉద్యోగులు తమ పని విధానాన్ని మార్చుకోవాలని, క్షేత్రస్థాయి పర్యటనలకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తేనే వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతామని చెప్పారు. పాత రోజుల్లో ఫైళ్ల క్లియరెన్స్ అనేది అతి పెద్ద టాస్క్‌గా ఉండేదని, కానీ ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ఆ ప్రక్రియ చాలా సులభతరమైందని గుర్తుచేశారు. పాలనలో వినూత్నంగా ఆలోచించకపోతే వ్యవస్థలు నిర్వీర్యమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
పాత కేసుల ట్రేసింగ్.. తప్పు చేసిన వాడు తప్పించుకోలేడు!
ఇటీవల కాలంలో డ్రగ్స్, గంజాయి వంటి వ్యసనాలకు అలవాటు పడి, మానసిక సమస్యల కారణంగా కొంతమంది నేరాలకు పాల్పడుతున్నారని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.
"తప్పు చేసిన వాడు ఎప్పుడూ చట్టం నుంచి తప్పించుకోలేడు. 2019లో జరిగిన కొన్ని పాత నేరాలను సైతం ఇప్పుడు పోలీసులు ట్రేస్ చేసి పట్టుకుంటున్నారు, వారికి శిక్షలు కూడా పడుతున్నాయి. ఇలాంటి విషయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది." అని అన్నారు
దీనితో పాటు వాహనాల నెంబర్ ప్లేట్ల విషయంలో ప్రమాణాలను, నిబంధనలను పక్కాగా పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
డిసెంబర్‌లో క్వాంటం కంప్యూటర్ లాంచ్.. పర్యావరణానికి పెద్దపీట
రాష్ట్ర సాంకేతిక ప్రగతిని వివరిస్తూ.. రాబోయే డిసెంబర్ నెలలో క్వాంటం కంప్యూటర్‌ను లాంచ్ చేయాల్సి ఉందని, ఈలోగా క్వాంటం పార్క్, సెమీ కండక్టర్ల పార్క్ ఏర్పాటుకు అవసరమైన వేగవంతమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వీటితో పాటు రాష్ట్రంలో పచ్చదనం పెంపు, పరిసరాల పరిశుభ్రత, నీటి భద్రత, భూగర్భ జలాల పెంపు, నీటి వనరుల సంరక్షణ, నదీ జలాలను కాలుష్యం నుంచి కాపాడడం వంటి అంశాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ కీలక సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో పాటు వివిధ శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.














Click it and Unblock the Notifications