ఏపీకి రెండు వందేభారత్, వారణాసికి నేరుగా - కేంద్ర మంత్రి..!!
ప్రముఖ పుణ్యక్షేత్ర వారణాసికి ఏపీ నుంచి డైరెక్టు రైలు ప్రారంభం కానుంది. అదే విధంగా ఏపీ నుంచి మరో రెండు వందేభారత్ రైళ్లు వస్తున్నట్లు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ వెల్లడించారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్తున్న వందేభారత్ కు అనూహ్య స్థాయి లో డిమాండ్ కనిపిస్తోంది. ఈ క్రమంలో కొత్తగా కోచ్ లను పెంచుతున్నారు. ఇప్పుడు రైల్వే మంత్రి కి అందిన ప్రతిపాదనలతో తెలుగు రాష్ట్రాలకు తొలి విడతలోనే వందేభారత్ స్లీపర్ దక్కనుంది.
కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కీలక ప్రకటన చేసారు. ఏపీకి కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యతను వివరిస్తూ త్వరలోనే మరిన్ని కొత్త రైళ్లు ఏపీ నుంచి ప్రారంభం అవుతాయని వెల్లడించారు. అందులో భాగం గా నరసాపురం-వారణాసి మధ్య కొత్త రైలు ప్రారంభం అవుతుందని చెప్పారు. ఈ మేరకు ఇప్పటికే రైల్వే మంత్రిని కోరినట్లు చెప్పుకొచ్చారు. గోదావరి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వారణాసి వెళ్లే ప్రయాణీకుల కోసం ఈ రైలు ఏర్పాటు చేయాలని కోరినట్లు వివరించారు. ఈ రైలు అందుబాటు లోకి వస్తే తెలుగు రాష్ట్రాల నుంచి వారణాసి వెళ్లే ప్రయాణీకులకు మరింత సౌకర్యంగా ఉంటుంద ని మంత్రి పేర్కొన్నారు.

అదే విధంగా మరో రెండు వందేభారత్ రైళ్లను నర్సాపురం నుంచి ప్రారంభించేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు. నరసాపురం - సికింద్రాబాద్‌ల మధ్య వందేభారత్ రైలు ప్రతిపాదనలో ఉందని చెప్పారు. త్వరలో భీమవరం - చెన్నైల మధ్య మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును తీసుకొస్తామని వెల్లడించారు. ఈ రెండు రైళ్ల కోసం సంప్రదింపులు కొనసాగుతున్నాయని మంత్రి వివరించారు. ఈ రైళ్లు ఖరారు సమయంలో ఇప్పటికే డిమాండ్ ఉన్న మార్గాలను పరిగణలోకి తీసుకొని.. వాటి మీదుగా వీటిని ఖరారు చేసే అవకాశం ఉందని అధికారులు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది.
విజయవాడ నుంచి బెంగళూరు, అదే విధంగా విశాఖ నుంచి తిరుపతికి వందేభారత్ స్లీపర్ రైళ్ల కోసం ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అమరావతి నుంచి అయోధ్య- వారణాసికి వందేభారత్ స్లీపర్ కేటాయించానే డిమాండ్ పైన రైల్వే శాఖ సానుకూలంగా స్పందించింది. దీంతో, నర్సాపురం నుంచి ఈ రైలు ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. వందేభారత్ స్లీపర్ రైళ్లు పూర్తి స్థాయిలో పట్టాలెక్కిన తరువాత ఈ రైళ్ల కేటాయింపు పైన అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications