రాజధానిగా అమరావతి: ఏకంగా సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్..!!
ఏపీ వికేంద్రీకరణ, మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటీషన్లు ఈ నెల 23వ తేదీన సుప్రీంకోర్టు సమక్షానికి విచారణకు రానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ అఫిడవిట్ ను దాఖలు చేసింది.
అమరావతి/న్యూఢిల్లీ: రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలంటూ దాఖలైన పిటీషన్లు ప్రస్తుతం దేశ అత్యున్నత న్యాయస్థానంలో విచారణ దశలో ఉన్నాయి. అమరావతిని ఆరు నెలల్లోగా అభివృద్ధి చేయాలంటూ ఏపీ హైకోర్టు దాఖలు చేసిన ఆదేశాలపై ఇదివరకే సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ పిటీషన్లపై తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీన చేపట్టనుంది. కిందటి నెల 31వ తేదీ నాడే తొలుత దీన్ని లిస్టింగ్ చేసినప్పటికీ- విచారణ సాధ్యం కాలేదు.

మరోసారి విచారణకు..
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం మూడు రాజధానుల పిటీషన్లపై విచారణను కొనసాగించనుంది. ప్రభుత్వం, పిటీషనర్ల తరఫున సీనియర్ అడ్వొకేట్లు కేకే వేణుగోపాల్, శ్యామ్ దివాన్ తమ వాదనలను వినిపించాల్సి ఉంటుంది. గతంలో చేపట్టిన విచారణ సందర్భంగా న్యాయమూర్తులు పలు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

సభలో కేంద్రం కీలక ప్రకటన..
అదే సమయంలో- ఏపీ రాజధాని వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సభలో కీలక ప్రకటన చేసింది. మూడు రాజధానుల అంశాన్ని పొందుపరిచింది. ఇదివరకు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లును ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుందని గుర్తు చేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో విచారణలో ఉందని వివరించింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారమే అమరావతి రాజధానిగా ఏర్పాటైందని, 2015లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చిందని తెలిపింది కేంద్రం.

సుప్రీంకోర్టులో ఉన్నందున..
ఏపీ రాజధాని, వికేంద్రీకరణ అంశాలు ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉన్నాయని, ఫలితంగా దీనిపై పూర్తిస్థాయిలో వివరణ గానీ, తమ సమాధానాన్ని గానీ ఇవ్వలేమని స్పష్టం చేసింది. మరోవంక- విశాఖపట్నానికి తరలివెళ్లడానికి ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేపట్టిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి- ఢిల్లీ వేదికగా స్వయంగా తాను విశాఖపట్నానికి వెళ్తున్నానని అన్నారు. విశాఖలో తన క్యాంప్ కార్యాలయం ఏర్పాటవుతుందనీ చెప్పుకొచ్చారు.

తాజాగా కేంద్రం కీలక అడుగు..
ఈ పరిణామాల మధ్య కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు ముందుకేసింది. అమరావతి, మూడు రాజధానుల వ్యవహారం, వికేంద్రీకరణ అంశాలపై తన అభిప్రాయాన్ని తెలియజేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ ను దాఖలు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ అఫిడవిట్ ఇచ్చింది. మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని సుప్రీంకోర్టుకు అఫిడవిట్ రూపంలో సమర్పించింది. ఈ నెల 23వ తేదీన విచారణ సందర్భంగా అఫిడవిట్ అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది సుప్రీంకోర్టు.












Click it and Unblock the Notifications