తెలుగు ప్రజలకు మరో వందే భారత్- ఎక్కడి నుంచి ఎక్కడి కంటే
తిరుపతి: కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల సౌకర్యం కోసం వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అత్యంత రద్దీ మార్గాల్లో ఒకటైన సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య దీన్ని నడిపిస్తోంది. సంక్రాంతి పండగను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు. దేశ రాజధాని నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రైలును ప్రారంభించారాయన.

ఆధునికీకరణకూ..
ఈ సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల మంత్రి జీ కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అదే సమయంలో ప్రధాని మోదీ- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకూ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ విలువ 699 కోట్ల రూపాయలు.

రెండు మార్గాల పరిశీలన..
కాగా- తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం మరో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకుని వచ్చే అవకాశం ఉంది. ఈ దిశగా ప్రతిపాదనలను సిద్ధం చేస్తోన్నట్లు తెలుస్తోంది. దీనికోసం రెండు లేదా మూడు మార్గాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మార్గాల ఎంపికపై ప్రస్తుతం కసరత్తు చేస్తోన్నట్లు సమాచారం.

ఈ మార్గాల్లో..
రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు మీదుగా విశాఖపట్నం- తిరుపతి లేదా కాచిగూడ, మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం, కడప, రాజంపేట, రేణిగుంట మీదుగా సికింద్రాబాద్- తిరుపతి మధ్య వందే భారత్ రైలును పట్టాలెక్కించాలని భావిస్తోన్నట్లు సమాచారం. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి మూడో మార్గంగా సికింద్రాబాద్, నల్లగొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు మీదుగా తిరుపతికి వెళ్లేలా మరో రూట్ కూడా రైల్వే అధికారుల పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అవన్నీ కూడా అత్యంత రద్దీతో కూడుకుని ఉన్నవే.

బడ్జెట్ లో ప్రకటించే ఛాన్స్?
తెలుగు ప్రజలకు కొత్తగా మంజూరు చేయదలిచిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను వచ్చే కేంద్ర బడ్జెట్ లో ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్- తన బడ్జెట్ ప్రతిపాదనలను ఉభయ సభలకు సమర్పించే సమయంలో దీనిపై ఓ ప్రకటన వెలువడుతుందని అంటున్నారు. దక్షిణ తెలంగాణ, రాయలసీమ జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉండేలా కాచిగూడ, మహబూబ్ నగర్, జోగుళాంబ అలంపురం, కర్నూలు, అనంతపురం, కడప, రాజంపేట, రేణిగుంట మీదుగా సికింద్రాబాద్- తిరుపతి మధ్య వందే భారత్ రైలును ప్రవేశపెట్టొచ్చనే అంచనాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications