బెంగళూరులో భారీ మిషన్ ప్రకటించిన డీకే శివకుమార్: మాగడి వద్ద
బెంగళూరు నిర్మాత, నాడప్రభు కెంపేగౌడ 517వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అభివృద్ధి కార్యక్రమాలను ప్రకటించింది. కెంపేగౌడ చారిత్రక వారసత్వాన్ని కాపాడుతూ, ఆయన పరిపాలనా దార్శనికతను, ఆశయాలను భవిష్యత్ తరాలకు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ఈ వేడుకల్లో భాగంగా బెంగళూరులో దాదాపు 10,000 మందితో భారీ మారథాన్‌ను విజయవంతంగా నిర్వహించారు.
బెంగళూరు శివార్లలోని మాగడిలో గల కెంపేగౌడ స్మారక స్థలాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని, దీనికోసం దాదాపు రూ. 100 కోట్లతో పలు నిర్మాణ పనులు చేపట్టామని వివరించారు. ఈ పనులను మరింత సమర్థవంతంగా, సకాలంలో పూర్తి చేయడం, పర్యాటకులకు అన్ని వసతులు కల్పించడానికి మరిన్ని నిధులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు.

ఈ మెమోరియల్ ప్రాజెక్ట్ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని కెంపేగౌడ స్మారక ప్రదేశం పరిధిని విస్తరించాలని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించింది. ఈ క్రమంలో మొత్తం 10 ఎకరాల భూమిని సేకరించాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా ఇప్పటికే రైతుల నుంచి సుమారు 5.5 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. మిగిలిన భూమిని సేకరించే ప్రక్రియ కూడా ప్రస్తుతం వివిధ దశల్లో కొనసాగుతోందని డీకే శివకుమార్ వివరించారు.
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులు, పర్యాటకులకు నగర వైభవం ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. విమానాశ్రయ ప్రాంగణంలో ఉన్న 108 అడుగుల ఎత్తైన కెంపేగౌడ కాంస్య విగ్రహం అందరికీ స్పష్టంగా కనిపించేలా సాంకేతిక మార్పులు చేయాలని బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయ అథారిటీని ఆదేశించినట్లు చెప్పారు. ఎయిర్‌పోర్టుకు వచ్చే ప్రతి ఒక్కరికీ ఈ భారీ విగ్రహం సులభంగా కనిపించేలా చేయాలని స్పష్టం చేశారు.
కెంపేగౌడ జయంతి స్మారకార్థం బెంగళూరు పర్యావరణ పరిరక్షణ కోసం బీడీఏ ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కెంపేగౌడ పేరు మీద దాదాపు 1.5 మిలియన్ అంటే సుమారు 15 లక్షల మొక్కలను నాటేందుకు భారీ ప్లాంటేషన్ డ్రైవ్‌ను ప్రారంభించింది. బెంగళూరు నగర పునరుజ్జీవన మిషన్ 2026-30లో భాగంగా బీడీఏ ఈ ప్రతిష్టాత్మక హరిత కార్యక్రమాన్ని ప్రతిపాదించింది. 12 గంటల్లో 15 లక్షల మొక్కలను నాటి గిన్నిస్ వరల్డ్ రికార్డును సృష్టించాలని బీడీఏ లక్ష్యంగా పెట్టుకుంది.
ఇందుకోసం నగర పరిధిలోని సుమారు 243 ఎకరాల విస్తీర్ణాన్ని 49 ప్రత్యేక జోన్లుగా గుర్తించింది. డాక్టర్ శివరామ కారంత్ లేఅవుట్, నాడప్రభు కెంపేగౌడ లేఅవుట్, బనశంకరి 6వ దశతో పాటు నగరంలోని చెరువు గట్లు, రాజకాలువల ఇరువైపులా, వివిధ పార్కులలో ఈ కార్యక్రమాన్ని ఉద్ధృతంగా నిర్వహించింది. దశలవారీగా ఇది కొనసాగుతుంది.












Click it and Unblock the Notifications