"వందేమాతరం పాడకపోతే మూడేళ్ల జైలు శిక్ష"
జాతీయ గేయం వందేమాతరంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వందేమాతరం గేయాన్ని అవమానించినా.. ఆలపిస్తున్న సమయంలో ఆటంకం కలిగించినా తీవ్ర నేరంగా పరిగణించనుంది. అలాగే వందేమాతరాన్ని అవమానిస్తే మూడేళ్ల జైలుశిక్ష విధిస్తామని కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు పార్లమెంట్ లో బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. 'ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ హానర్' బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టనున్నారు.
జూలై 20, సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభంగానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశాల్లో తొలిరోజే ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టి, ఆ తర్వాత లోక్ సభలో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఈ బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ హానర్ (సవరణ)-2026 పేరుతో ఓ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం అమలులో ఉన్న 1970 నాటి చట్టం ప్రకారం.. జాతీయ గేయం, జాతీయ గీతం, జాతీయ పతాకాన్ని అవమానించడం చట్టరిత్యా నేరం. దీనికి మూడేళ్లపాటు జైలు శిక్ష లేదా జరిమానా, లేదంటే రెండూ విధించే నిబంధన ఉంది. తాజాగా ఈ చట్టానికి సవరణ చేయడం ద్వారా ఆ జాబితాలో 'వందేమాతరం' గేయాన్ని చేర్చనున్నారు. తాజా నిబంధన ప్రకారం ఎవరైనా వందేమాతరం ఆలపించడాన్ని అడ్డుకున్నా లేదా అవమానపరిచే చర్యలకు పాల్పడినా మూడేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది.

ఇక భారత స్వాతంత్ర్య పోరాటంలో వందేమాతరం గేయం కీలక పాత్ర పోషించింది. ఈ గేయాన్ని బంకీం చంద్ర ఛటోపాధ్యాయ రచించారు. ఇది ఛటర్జీ రాసిన 'ఆనంద్ మఠ్' నవలలో తొలిసారి ప్రచురితమైంది. ఈ గేయానికి 1950లో రాజ్యాంగ పరిషత్ 'జాతీయ గేయం' హోదాను కల్పించింది.












Click it and Unblock the Notifications