వంకాయను కాల్చి, నూనె లేకుండా చేసే బైంగన్ భర్తా - మామూలుగా ఉండదు!
నిత్యం రకరకాల కూరలు వండుకు తింటున్నా నాలుకకు మాత్రం ఎప్పుడూ కొత్త రుచులు కావాలి. అటు ఆరోగ్యం, ఇటు కమ్మటి రుచి రెండూ కావాలంటే నూనె అక్కర్లేని ఈ బైంగన్ భర్తా ఒక్కసారి ప్రయత్నించండి. వంకాయను సన్నని సెగ మీద కాల్చి, టొమాటోలు, మసాలాలతో తయారు చేస్తే నూనె లేకుండానే అద్భుతమైన రుచి వస్తుంది.
కావలసిన పదార్థాలు:
పెద్ద వంకాయ - 1 (సుమారు అర కిలో),
టొమాటోలు - 4,
ఉల్లిపాయ తరుగు - గుప్పెడు,
కొత్తిమీర తరుగు - గుప్పెడు,
పచ్చిమిర్చి - 2,
వెల్లుల్లి - 5 రెబ్బలు,
అల్లం తరుగు - 1 స్పూన్,
జీలకర్ర పొడి - అర స్పూన్,
గరం మసాలా - అర స్పూన్,
ధనియాల పొడి - 1 స్పూన్,
కారం - 1 స్పూన్,
నిమ్మరసం - 1 స్పూన్,
పసుపు - పావు స్పూన్,
ఉప్పు - తగినంత.

తయారీ విధానం:
ముందుగా వంకాయను బాగా కడిగి, తడి లేకుండా తుడవాలి. కొంచెం లోతుగా గాట్లు పెట్టి, అందులో వెల్లుల్లి రెబ్బలు పెట్టాలి. సన్నని సెగ మీద వంకాయను తిప్పుతూ అన్ని వైపులా సమానంగా కాల్చాలి. చల్లారిన తర్వాత వంకాయ పైన కాల్చిన తొక్కను తీసేసి, లోపలి గుజ్జును మెత్తగా మెదపాలి. ఇప్పుడు ప్యాన్‌లో 3 టేబుల్ స్పూన్ల నీళ్లు వేడి చేసి, ఉల్లిపాయ తరుగు వేయాలి.
ఇది నీళ్ళతో చేసే స్పెషల్ వంటకం
ఉడికాక అల్లం, పచ్చిమిర్చి ముద్ద, టొమాటో ముక్కలు వేసి మూత పెట్టి మెత్తబడే వరకు ఉడికించాలి. అవసరమైతే కొంచెం నీళ్లు కలపవచ్చు. తర్వాత కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, వేయించిన వంకాయ గుజ్జు వేసి బాగా కలపాలి. నాలుగు నిమిషాలు ఉడికించిన తర్వాత గరం మసాలా, నిమ్మరసం, కొత్తిమీర వేసి దించేయాలి.
స్మోకీ రుచితో సూపర్ బైంగన్ భర్తా
వంకాయను సన్నని సెగ మీద కాల్చడం వల్ల చక్కటి స్మోకీ రుచి వస్తుంది. టొమాటోలు మెత్తగా ఉడికించడం వల్ల నూనె లేకుండానే టేస్టీగా ఉంటుంది. నిమ్మరసం, కొత్తిమీర వేయడం వల్ల రుచి మరింత పెరుగుతుంది. ఇది అన్నంతోనే కాదు, చపాతీ, జొన్న రొట్టెలతో కూడా చాలా బాగుంటుంది. ఆరోగ్యంగా ఉండాలనుకునేవారు, నూనె తగ్గించుకోవాలనుకునేవారు ఈ రెసిపీని తప్పకుండా ప్రయత్నించండి. సులభంగా తయారవుతుంది, రుచి కూడా అద్భుతంగా ఉంటుంది.













Click it and Unblock the Notifications
