ఎర్రవల్లి భూములపై సర్వే.. కేసీఆర్ ఫామ్‌హౌస్ చుట్టూ ఎందుకింత రాజకీయం?
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్‌హౌస్, ఆస్తుల వ్యవహారంపై తెలంగాణ ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎర్రవల్లి ఫామ్‌హౌస్ చుట్టూ ఉన్న భూములు, ధరణి పోర్టల్ ద్వారా జరిగిన ఆస్తుల కేటాయింపులు, విదేశీ పెట్టుబడులపై విచారణకు ఆదేశించడంతో ఈ అంశం తెలంగాణలో రాజకీయంగా, సామాజికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
'అక్రమాస్తుల కూడబెట్టుడే'.. కాంగ్రెస్ శ్రేణుల విమర్శలు
కాంగ్రెస్ పార్టీ నాయకులు, మద్దతుదారులు, అధికార పక్షం ఈ వ్యవహారాన్ని తెలంగాణ రక్షణ హక్కుల కోణంలో విమర్శిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ద్వారా అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కుటుంబం.. దశాబ్ధ కాలంలో వేల కోట్ల రూపాయల ఆస్తులను, వందలాది ఎకరాల భూములను కూడబెట్టిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ధరణి పోర్టల్ పేరిట భూముల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని.. ఫామ్‌హౌస్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారనే విషయాలపై ప్రభుత్వం విచారణ జరుపుతుండటంతో ప్రజల్లో కూడా దీనిపై స్పష్టమైన సమాధానాలు రావాలనే డిమాండ్ వినిపిస్తోంది.

అక్రమాస్తుల కోట ఫామ్‌హౌస్
"పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలకు దక్కింది గుండుసున్న. కానీ కేసీఆర్ కుటుంబానికి మాత్రం ఎర్రవల్లిలో వందలాది ఎకరాల భూములు, లగ్జరీ ఫామ్‌హౌస్‌లు వచ్చినయి. ధరణి పోర్టల్ ద్వారా అసైన్డ్, పేదల భూములను గుంజుకుని ఫామ్‌హౌస్ పరిసరాల్లోకి కలుపుకున్నారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి భూములను మళ్లీ ప్రజలకు అప్పగించాలి." -వెంకన్న, కాంగ్రెస్ కార్యకర్త.
చట్టం ముందు ఎవరైనా ఒకటే..
"ఎన్నికల్లో ఓడిపోయినా కేసీఆర్‌లో దొరతనం పోలేదు. చట్టపరమైన నోటీసులు ఇస్తే ఆందోళనల పేరుతో రాజకీయ చేయడం ఆపి కోర్టులో నిరూపించుకోవాలి." -శ్రీనివాస్, కాంగ్రెస్ లీడర్
'రాజకీయ కక్షసాధింపే': బీఆర్ఎస్ మద్దతుదారులు
మరోవైపు బీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ మద్దతుదారులు ఈ ఆరోపణలను కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యగా కొట్టిపారేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి.. ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలతో అభివృద్ధి చేసిన నాయకుడిపై బురద జల్లేందుకే కాంగ్రెస్ సర్కారు రోజుకో రకమైన వివాదాన్ని తెరపైకి తెస్తోందని ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ఫామ్‌హౌస్, ఆస్తుల లీగల్ నోటీసుల డ్రామాలు ఆడుతున్నారని, వ్యవసాయ భూములలో సాగు చేయడం నేరం కాదని బీఆర్ఎస్ శ్రేణులు సమర్థిస్తున్నాయి.
రాజకీయ కక్షసాధింపు డ్రామాలు
"కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ఆరు గ్యారంటీల అమలులో విఫలమై, ప్రజల దృష్టిని మళ్లించడానికి కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై పదే పదే విచారణలు, ముట్టడుల నాటకాలు ఆడుతోంది. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడిని, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన ప్రదాతను టార్గెట్ చేస్తే ప్రజలే తగిన బుద్ధి చెప్తారు." -సంతోష్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యకర్త
నిజాలు బయటకు రావాలి.. సామాన్య ప్రజల అభిప్రాయం
సామాన్య ప్రజలు, రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసే ఆరోపణలు, అధికారంలోకి వచ్చాక కేవలం ప్రకటనలకే పరిమితం కాకూడదని భావిస్తున్నారు. నిజంగా అక్రమాలు జరిగి ఉంటే చట్టప్రకారం పూర్తిస్థాయి విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని, ఒకవేళ ఆరోపణల్లో నిజం లేకపోతే రాజకీయ ప్రయోజనాల కోసం కాలయాపన చేయడం సరికాదని ప్రజలు స్పష్టం చేస్తున్నారు.
ఎన్నో సమస్యలు ఉన్నాయి?
"ప్రస్తుతం రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఉచిత పథకాల అమలు వంటి అనేక కీలక సమస్యలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో నిత్యం రాజకీయ గొడవలు, ఫామ్‌హౌస్ ముట్టడులు, అరెస్టుల చుట్టూ వార్తలు తిరగడం వల్ల ప్రజల అసలు సమస్యలు పక్కదారి పడుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు వ్యక్తిగత కక్షసాధింపులా కనిపిస్తున్నాయే తప్ప.. ప్రజలకు ఏం ఉపయోగం." -సామాన్య పౌరుడు.














Click it and Unblock the Notifications
