రాష్ట్రంలో కొత్త పథకం.. రేపే ప్రారంభం.. అర్హులు వీళ్లే..!
రాష్ట్రంలోని పేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే పథకాన్ని పట్టణాల్లోని పేదలకు వర్తింపజేస్తోంది. పట్టణాల్లోని తక్కువ ఆదాయ వర్గాల(LIG) కోసం ఇందిరమ్మ ఇళ్లు- ఎల్ఐజీ హౌసింగ్ టవర్స్ పథకాన్ని జూలై 20 సోమవారం రోజున ప్రారంభించనుంది. హైదరాబాద్ లోని క్యూఆర్(కోర్ అర్బన్ రీజియన్) లో మొదలయ్యే ఈ పథకం ద్వారా ఆధునిక అపార్ట్ మెంట్ తరహా గృహాలను అందుబాటులోకి తీసుకొస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ మేరకు దరఖాస్తు విధానం, అర్హతలను త్వరలోనే ప్రకటించనుంది.
ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక లక్ష ఇళ్లను నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తొలి దశలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి కనీసం 500 నుండి 1000 ఇళ్లను కేటాయించనుంది. ఎలాంటి లోటుపాట్లు లేకుండా పారదర్శకంగా అర్హులను ఎంపిక చేసి అధికారులు పనులను వేగవంతం చేయనున్నారు. నిర్మాణ నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా.. నిర్ణీత సమయంలోనే ఇళ్లను పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
మరోవైపు క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఎల్ ఐజీ ఇళ్ల కార్యక్రమాన్ని సోమవారం సచివాలయంలో ప్రారంభించనున్న నేపథ్యంలో ఉన్నతాధికారులతో గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఏర్పాట్లను సమీక్షించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సొంతింటిని నిర్మించి అందిస్తామని తెలిపారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు. ఆ సంకల్పంతోనే ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని ప్రారంభించిందని అన్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 100శాతం సబ్సిడీతో రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తూ పేదల ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టినట్లు స్పష్టం చేశారు.

ఈ విడతలో హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 50 వేల ఇళ్ల మంజూరు ప్రక్రియను ప్రారంభించామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణంపై దృష్టి పెట్టిందని ఇప్పుడు హైదరాబాద్ తో పాటు పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న పేదల సొంతింటి కలను సాకారం చేయబోతుందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications