కేంద్రం నుంచి మరో విడత ఫండ్స్- జగన్‌కు బిగ్ రిలీఫ్
న్యూఢిల్లీ/అమరావతి: దేశవ్యాప్తంగా విస్తృతంగా భారీ వర్షాలు కురుస్తోన్నాయి. ప్రత్యేకించి ఉత్తరాది రాష్ట్రాలను గజగజా వణికిస్తోన్నాయి. వర్షాల ధాటికి హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమౌతోంది. ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దేశ రాజధానిలో యమునా నది మహోగ్ర రూపాన్ని దాల్చింది. ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది.
వర్షాల నేపథ్యంలో- ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ కింద తక్షణ చర్యలను తీసుకుంటోన్నాయి. లోతట్టు ప్రాంతాలవాసులను సురక్షిత ప్రదేశాలకు తరలించడం, వారికోసం సహాయ, పునరావాస శిబిరాలను ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాల కోసం భారీగా నిధులను వ్యయం చేస్తోన్నాయి.

ఈ పరిస్థితుల మధ్య- కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తీపి కబురు ఇచ్చింది. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద వేల కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఈ మేరకు జాతీయ విపత్తు నిర్వహణ విభాగాన్ని పర్యవేక్షిస్తోన్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఆమోదం తెలిపింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ కింద తక్షణ చర్యలను చేపట్టడానికి అవసరమైన నిధులను మంజూరు చేసింది.
వర్షాకాలంలో చేపట్టాల్సిన విపత్తు నిర్వహణ చర్యల కోసం 22 రాష్ట్రాలకు 7,532 కోట్ల రూపాయలను విడుదల చేసింది. 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ మొత్తాన్ని ఆయా రాష్ట్రాలు ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. కిందటి నెలలో 6,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను విడుదల చేసింది కేంద్రం. ఇప్పుడు మరో విడలో 7,532 కోట్ల రూపాయలను మంజూరు చేసింది.
ఎస్డీఆర్ఎఫ్ కింద ఆంధ్రప్రదేశ్‌కు అందిన నిధుల వాటా 493 కోట్ల రూపాయలు. తెలంగాణకు 188 కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేసింది. అరుణాచల్ ప్రదేశ్-రూ.110 కోట్లు, అస్సాం-రూ.340, బిహార్-రూ.624, ఛత్తీస్‌గఢ్- రూ.181.60, గోవా- రూ.4.80, గుజరాత్- రూ.584, హర్యానా- రూ. 216.80, హిమాచల్ ప్రదేశ్- రూ. 180.40, కర్ణాటక- రూ. 348.80 కోట్ల రూపాయలు విడుదల అయ్యాయి.
కేరళ- రూ. 138.80, మహారాష్ట్ర- రూ. 1,420.80, మణిపూర్- రూ. 18.80, మేఘాలయా- రూ. 27.20, మిజోరం- రూ.20.80, ఒడిశా- రూ.707.60 కోట్లు, పంజాబ్- రూ. 218.40, తమిళనాడు- రూ.450, త్రిపుర- రూ. 30.40, ఉత్తరప్రదేశ్- రూ. 812, ఉత్తరాఖండ్- రూ. 413.20 కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేసింది.












Click it and Unblock the Notifications