ఆ ఇద్దరికీ ఢిల్లీ పిలుపు: ఆ సమస్యలపై ఆలస్యంగానైనా - కదిలిన కేంద్రం
అమరావతి: విభజన తరువాత రెండు తెలుగు రాష్ట్రాలు ఎదుర్కొంటోన్న సమస్యలపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు దృష్టి సారించింది. ఏపీ పునర్విభజన చట్టంపై సమీక్ష నిర్వహించనుంది. విభజన చోటు చేసుకున్న ఎనిమిది సంవత్సరాల తరువాత- కొన్ని కీలక అంశాలను పరిష్కరించడానికి కసరత్తు మొదలు పెట్టింది. 9, 10 షెడ్యూల్‌లో పొందుపరిచిన అంశాలతో పాటు- ఈ యాక్ట్ కింద రెండు తెలుగు రాష్ట్రాలకు మంజూరు చేయాల్సిన నిధులు, ప్రాజెక్టులపై చర్చించనుంది.
ఏపీ పునర్విభజన చట్టం ఆమోదం పొంది ఎనిమిది సంవత్సరాలు దాటింది. ఆ చట్టంలోని 10, 11వ షెడ్యూళ్లల్లో పొందుపరిచిన అంశాలు పెద్దగా పరిష్కారానికి నోచుకోలేదు. 11వ షెడ్యూల్ పొందుపరిచినట్టుగా- రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుల మార్గదర్శకాలతో పాటు నీటి పంపకాల సమస్యను కేంద్రం సామరస్యంగా పరిష్కరించాల్సి ఉంది. ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్, దుగ్గరాజపట్నం పోర్ట్, ఖమ్మం, కడప జిల్లాల్లో స్టీల్ ఫ్యాక్టరీల ఏర్పాటు వంటివీ ఇందులో ఉన్నాయి.

9వ షెడ్యూల్‌లోని సంస్థలకు సంబంధించిన వివాదం, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన ప్రస్తుతం కీలకంగా మారింది. ఏపీకి తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన 6,500 కోట్ల రూపాయల బకాయిలు విడుదల కావట్లేదు. ఉమ్మడి ఆస్తుల్లో ఏపీ-తెలంగాణ వాటాలను కేంద్రం ఆమోదించాల్సి ఉంది. ఉమ్మడి ఆస్తుల్లో ఏపీ-58, తెలంగాణ-42 శాతం వాటా ఇవ్వాల్సి ఉంటుందని కేంద్రం ఇదివరకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
ఆయా అంశాలన్నింటిపై చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం ఓ పూర్తిస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ నెల 26, 27 తేదీల్లో ఈ భేటీ ఏర్పాటు కానుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ భల్లా దీనికి సారథ్యాన్ని వహించనున్నారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు డాక్టర్ సమీర్ శర్మ, సోమేష్ కుమార్ ఇందులో పాల్గొననున్నారు. ఆర్థికం, జల వనరుల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు ఇందులో పాల్గొనే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications