ప్యాకేజీపై ఎత్తుకు పైయెత్తులు: చంద్రబాబు దోబూచులాట
న్యూఢిల్లీ : తాము ప్రకటించే ప్రత్యేక ప్యాకేజీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఆమోదం ఉందని చూపించాలనే ఎత్తుగడలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ రకంగా ఇరికించడం ద్వారా ప్రత్యేక హోదాపై ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత చంద్రబాబు మాట్లాడకుండా చేయాలని వ్యూహ రచన చేసినట్లు చెబుతున్నారు. దానివల్ల కూడా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటనలో కేంద్రం జాప్యం చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబును ఢిల్లీ రావాలని పిలిచినట్లు సరైన సమాచారం లేదు. అయితే కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు మాత్రం చంద్రబాబుతో మాట్లాడారు. మరోవైపు కేంద్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు సుజనా చౌదరి ఢిల్లీ చర్చల్లో పాల్గొంటూ ఎప్పటికప్పుడు విషయాలను చంద్రబాబుకు చేరవేస్తున్నారు. ప్రత్యేక హోదాను తాను వదిలేసిన భావన కలగకూడదనే ఎత్తుగడలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలో ఉన్నారు. మోడీ విదేశీ పర్యటన నుంచి శుక్రవారం వస్తున్నారు. దీంతో ప్రధాని వచ్చిన తర్వాతనే ప్రత్యేక ప్యాకేజీపై కేంద్రం ప్రకటన చేసే అవకాశం ఉంది. గురువారంనుంచి (రేపటి నుంచి) శాసనసభా సమావేశాలు ఉన్నందువల్ల చంద్రబాబు ఢిల్లీ వెళ్లే అవకాశం లేదని అంటున్నారు. ఈ సమావేశాల దృష్ట్యా కూడా ప్రత్యేక ప్యాకేజీపై ప్రకటనలో జాప్యం జరిగే అవకాశం ఉంది.

చంద్రబాబును ఒప్పించకుండా, ఆయన సమక్షంలో ప్రకటన చేయకుండా కేంద్రం తనంత తానుగా ప్రకటిస్తే సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్లు బిజెపి నాయకులు అభిప్రాయపడుతున్నారు. దానివల్ల కూడా ప్రత్యేక ప్యాకేజీపై జాప్యం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక హోదాపై రాజీ పడే ప్రసక్తి లేదని చంద్రబాబు అంటున్నట్లు ఒక వర్గం మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ప్రత్యేక ప్యాకేజీని అంగీకరించాను గానీ ప్రత్యేక హోదా అంశాన్ని వదిలిపెట్టలేదని కేంద్రం ప్రకటన వెలువడిన తర్వాత చంద్రబాబు మాట్లాడితే రాజకీయంగా తమకు ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో బిజెపి ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఆ రకమైన వైఖరిని తీసుకునే వీలు లేకుండా ఆయన సమక్షంలోనే స్పష్టత ఇవ్వాలనే ఎత్తుగడలో కేంద్రం ఉన్నట్లు భావిస్తున్నారు. కేంద్రం, చంద్రబాబు ఎత్తులకు పైయెత్తులు వేసుకుంటూ రాజకీయంగా నష్టపోకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో వ్యవహరిస్తున్నట్లు అర్థమవుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రకటించే ప్రత్యేక ప్యాకేజీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం కూడా అవసరం పడుతుందని అంటున్నారు. నరేంద్ర మోడీ లేకుండా కేంద్ర మంత్రివర్గం సమావేశమయ్యే అవకాశాలు లేవు. దీనివల్ల కూడా కేంద్ర ప్రకటనలో జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రత్యేక హోదా వల్ల చేకూరే ఆర్థిక ప్రయోజనాలను కేంద్రం భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రత్యేక హోదా వల్ల పరిశ్రమల స్థాపనకు ఒనగూరే పన్ను రాయితీలు కూడా కావాలని చంద్రబాబు అడుగుతున్నట్లు తెలుస్తోంది. పన్ను రాయితీలు ఇస్తూ ప్రకటన చేసేందుకు కేంద్రం సిద్ధపడితే చంద్రబాబు అంగీకరించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఏమైనా, ప్రత్యేక ప్యాకేజీపై కేంద్రంతో చంద్రబాబు దోబూచులాట ఆడుతున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications