కోడ్ వేల సామాన్యులు నగదు ఎంత తీసుకెళ్లచ్చు - దాటితే సీజ్..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం పతాక స్థాయికి చేరింది. ఎన్నికల సంఘం డేగ కన్నుతో ఎన్నికల ప్రచారం గమనిస్తోంది. ఎన్నికల నిర్వహణ పైన అధికారులకు ఆదేశాలు ఇస్తోంది. ఇదే సమయంలో మద్యం, నగదు రవాణా.. లావాదేవీల పైన ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. పలు చోట్ల లెక్కలు లేని నగదును అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. దీంతో, కోడ్ సమయంలో సామాన్యులు ఎంత నగదు తీసుకు వెళ్లవచ్చనే దాని పైన అధికారులు స్పష్టత ఇస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికలను శాంతియుతంగా,స్వేచ్ఛగా నిర్వహించాల్సిన బాధ్యత జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలపైనే ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. తక్షణమే సమస్యలపై స్పందించి పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీస్ సూపరింటెండెట్లు, పోలీస్ కమిషనర్లతో సీఈవో మీనా మీడియో కాన్పరెన్సు నిర్వహించారు. ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు చేస్తున్న ఏర్పాట్లను, అధికారులు తీసుకుంటున్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో ఎటు వంటి హింసకు, రీపోలింగ్ కు అవకాశం లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలను చేపట్టాలన్నారు. గంజాయి, లిక్కర్, నగదు ఇతర ఉచితాల అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘా ఉంచాలని సూచించారు.

ఎన్నికల కోడ్ను పటిష్టంగా అమలుపర్చే అంశాలపై చర్చించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, వ్యక్తులు రూ. 50 వేలకు మించి నగదు కలిగి ఉంటే వెంటనే జప్తుచేయాలని.. వ్యాపారులు, సాధారణ పౌరుల విషయంలో ఆచితూచి అడుగువేయాలని వారిని ఎటు వంటి ఇబ్బందులకు గురిచేయవద్దన్నారు. నగదు జప్తు కేసులను 24 గంటల్లోనే పరిష్కరించాలని, ఇందుకై రాష్ట్రమంతా ఒకే విధానాన్ని అనుసరించేలా త్వరలో ఎస్.ఓ.పి.ని రూపొందిస్తామని మీనా చెప్పారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇంటింటి ప్రచారానికై ముందస్తుగా పొందాల్సిన అనుమతి విషయంలో సీఈసీకి లేఖ రాశామన్నారు. రాష్ట్రంలో చేస్తున్న ఎన్నికల ఏర్పాట్లు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు విషయంలో వారు సంతృప్తి చెందేలా చూసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications